
లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. నాలుగో రోజు భారత బౌలర్లు చెలరేగిపోయారు. రెండు సెషన్లలోనే ఇంగ్లండ్‌ను 192 పరుగులకే కుప్పకూల్చారు. ఫలితంగా భారత్ 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.
వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. కీలకమైన రూట్ (40), జేమీ స్మిత్ (8), బెన్ స్టోక్స్ (33) వికెట్లతో షోయబ్ బషీర్ (2) వికెట్ తీసి ఇంగ్లండ్‌ను చావుదెబ్బకొట్టాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై అటాక్ చేశాడు. టీ విరామం తర్వాత బుమ్రా క్రిస్ వోక్స్ (10), బ్రైడన్ కార్స్‌లను (1) క్లీన్ బౌల్డ్ చేశాడు.
అంతకుముందు తొలి సెషన్‌లో సిరాజ్, నితీశ్ కుమార్, ఆకాశ్‌దీప్ చెలరేగిపోయారు. డకెట్ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్ పెవిలియన్‌కు పంపగా.. జాక్ క్రాలేను (22) నితీశ్, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్ ఔట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తరఫున రూట్ (104), జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) సత్తా చాటగా.. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), పంత్ (74), జడేజా (72) రాణించారు.
బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని శాశించగా.. సిరాజ్, నితీశ్ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11, బెన్ స్టోక్స్ 44, క్రిస్ వోక్స్ 0, జోఫ్రా ఆర్చర్ 4 పరుగులకు ఔటయ్యారు.
భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 13, కరుణ్ నాయర్ 40, శుభ్‌మన్ గిల్ 16, నితీశ్ రెడ్డి 30, వాషింగ్టన్ సుందర్ 23, ఆకాశ్‌దీప్ 7, బుమ్రా 0, సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 3, ఆర్చర్, స్టోక్స్ తలో 2, కార్స్, బషీర్ చెరో వికెట్ తీశారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.