దుమ్మురేపుతున్న టీమిండియా బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్‌ | ENG VS IND 3rs Test, Day 4: England In Deep Trouble, Lost 6 Wickets For Just 164 Runs | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న టీమిండియా బౌలర్లు.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్‌

Jul 13 2025 8:23 PM | Updated on Jul 13 2025 8:23 PM

ENG VS IND 3rs Test, Day 4: England In Deep Trouble, Lost 6 Wickets For Just 164 Runs

లార్డ్స్‌ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపుతున్నారు. నాలుగో రోజు ప్రారంభం నుంచే చెలరేగుతున్న మన వాళ్లు టీ విరామం సమయానికి ఇంగ్లండ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు. తొలి సెషన్‌లో సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌దీప్‌ విజృంభించగా.. రెండో సెషన్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ సత్తా చాటాడు.

టీ విరామం సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్కోర్‌ 6 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. బెన్‌ స్టోక్స్‌ (27), క్రిస​్‌ వోక్స్‌ (8) ఇంగ్లండ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

తొలి సెషన్‌లో సిరాజ్‌ (7-2-11-2), నితీశ్‌ రెడ్డి (5-1-20-1), ఆకాశ్‌దీప్‌ (5-2-23-1) పదునైన బంతులతో ఇంగ్లండ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించగా.. రెండో సెషన్‌లో సుందర్‌ (7-2-13-2) తన మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

భారత పేస్‌ అటాక్‌ ధాటికి ఇంగ్లండ్‌ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి డకెట్‌ (12), ఓలీ పోప్‌ను (4) సిరాజ్‌ పెవిలియన్‌కు పంపగా.. జాక్‌ క్రాలేను (22) నితీశ్‌, హ్యారీ బ్రూక్‌ను (23) ఆకాశ్‌దీప్.. జేమీ స్మిత్‌ (8), జో రూట్‌ను (40) సుందర్‌ ఔట్‌ చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్‌ (387) చేసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తరఫున రూట్‌ (104), జేమీ స్మిత్‌ (51), బ్రైడన్‌ కార్స్‌ (56) సత్తా చాటగా.. భారత్‌ తరఫున కేఎల్‌ రాహుల్‌ (100), పంత్‌ (74), జడేజా (72) రాణించారు. 

బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పతనాన్ని శాశించగా.. సిరాజ్‌, నితీశ్‌ తలో 2, రవీంద్ర జడేజా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో క్రాలే 18, డకెట్‌ 23, ఓలీ పోప్‌ 44, హ్యారీ బ్రూక్‌ 11, బెన్‌ స్టోక్స్‌ 44, క్రిస్‌ వోక్స్‌ 0, జోఫ్రా ఆర్చర్‌ 4 పరుగులకు ఔటయ్యారు. 

భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 13, కరుణ్‌ నాయర్‌ 40, శుభ్‌మన్‌ గిల్‌ 16, నితీశ్‌ రెడ్డి 30, వాషింగ్టన్‌ సుందర్‌ 23, ఆకాశ్‌దీప్‌ 7, బుమ్రా 0, సిరాజ్‌ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 3, ఆర్చర్‌, స్టోక్స్‌ తలో 2, కార్స్‌, బషీర్‌ చెరో వికెట్‌ తీశారు. 

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement