
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ అద్భుతమైన బంతితో బెన్ డకెట్‌ను (12) బోల్తా కొట్టించాడు. పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో డకెట్ బుమ్రాకు సునాయాసమైన క్యాచ్ అందించాడు.
డకెట్‌ను ఔట్ చేశాక సిరాజ్ పట్టలేని ఆనందంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. డకెట్‌వైపు కోపంగా చూస్తూ పెవిలియన్‌వైపు అడుగులేస్తున్న అతన్ని భుజంతో ఢీకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. సిరాజ్ ప్రవర్తనపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరం లేదని అక్షింతలు వేస్తున్నారు. కొట్టేస్తావా ఏంటని ప్రశ్నిస్తున్నారు.
DSP SIRAJ ON DUTY AT LORD's 🫡📢 pic.twitter.com/6Sb0LiEuGl
— Johns. (@CricCrazyJohns) July 13, 2025
కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ మూడో రోజు చివర్లో కూడా ఇదే తరహా ప్రదర్శనతో నెటిజన్లచే చివాట్లు తిన్నాడు. మూడో రోజు ఆట ముగియడానికి ఆరు నిమిషాలు ఉండగా.. ఇంగ్లండ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది.
ఈ సమయంలో భారత్ కనీసం రెండు ఓవర్లు అయినా బౌలింగ్ చేయాలని తహతహలాడింది. కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ఒక్క ఓవర్ ఆడి మూడో రోజు ఆటను ముగించాలని భావించారు. దీంతో బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన గిల్.. క్రాలీని పరుష పదజాలంతో దూషించాడు. దీంతో జాక్ క్రాలీ కూడా వేలు చూపిస్తూ వాగ్వాదానికి దిగాడు. గిల్‌కు తోడుగా సిరాజ్ కూడా సీన్‌లోకి కావడంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అంపైర్‌లు జోక్యంతో చేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. గిల్, సిరాజ్ ప్రవర్తనను క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. ఇంత ఓవరాక్షన్ అవసరం లేదని హితవు పలుకుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండు వికెట్లు సిరాజే తీసుకున్నాడు. తొలుత డకెట్‌ను ఔట్ చేసిన సిరాజ్, ఆతర్వాత ఓలీ పోప్‌ను (4) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 12 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 42/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒకే స్కోర్ (387) చేసిన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ రూట్ (104) సెంచరీ, జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ 387 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా ఐదు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్ కేఎల్ రాహుల్ (100) సెంచరీ, పంత్ (74), జడేజా (72) అర్ద సెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ చేసిన 387 పరుగుల వద్దనే ఆలౌటైంది.