సిరాజ్‌ ‘సిక్సర్‌’ | ENG VS IND 2nd Test Day 3: Indian pacer Mohammed Siraj took six wickets | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ ‘సిక్సర్‌’

Jul 5 2025 1:00 AM | Updated on Jul 5 2025 9:00 AM

ENG VS IND 2nd Test Day 3: Indian pacer Mohammed Siraj took six wickets

పట్టు వదిలినా... పైచేయి మనదే!

ఆరు వికెట్లతో మెరిసిన భారత పేసర్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 407 ఆలౌట్‌

స్మిత్, బ్రూక్‌ భారీ సెంచరీలు

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 64/1

ప్రస్తుతం ఓవరాల్‌ ఆధిక్యం 244  

భారత బౌలింగ్‌ ధాటికి ఒకదశలో ఇంగ్లండ్‌ స్కోరు 84/5... ఇక మూడో రోజే మ్యాచ్‌ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్‌ అసాధారణ బ్యాటింగ్‌తో ఎదురుదాడి చేసి ‘ట్రిపుల్‌ సెంచరీ’ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్‌ తేరుకోగలిగింది.  హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్ల ప్రదర్శన శుక్రవారం ఆటలో హైలైట్‌గా నిలవగా, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ‘డకౌట్‌’ కావడం విశేషం. అయినా సరే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 180 పరుగులతో కలిపి ఇప్పటికే 244 పరుగులు ముందంజలో ఉన్న టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. నేడు మన బ్యాటర్లు చెలరేగి ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతారనేది ఆసక్తికరం.

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగించింది. మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్‌గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్‌ (22 బంతుల్లో 28; 6 ఫోర్లు) అవుట్‌ కాగా... కేఎల్‌ రాహుల్‌ (38 బంతుల్లో 28 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 77/3తో శుక్ర వారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్‌ (207 బంతుల్లో 184 నాటౌట్‌; 21 ఫోర్లు, 4 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (234 బంతుల్లో 158; 17 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగులు జోడించారు. భారత పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్‌ (6/70), ఆకాశ్‌దీప్‌ (4/88) కలిసి ప్రత్యరి్థని పడగొట్టారు. 

మెరుపు భాగస్వామ్యం... 
మూడో రోజు ఆటలో తొలి 10 బంతులు ముగిసేసరికి మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసినట్లు అనిపించింది! ‘హైదరాబాద్‌ పేసర్‌’ సిరాజ్‌ వరుసగా రెండు చక్కటి బంతులతో రూట్‌ (22), స్టోక్స్‌ (0)లను పెవిలియన్‌ పంపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండోసారి ఇంగ్లండ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ వికెట్ల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్రూక్, స్మిత్‌ కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మిత్‌ 80 బంతుల్లోనే సెంచరీ (14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించడం విశేషం. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టడం విశేషం.  

తప్పిన ఫాలోఆన్‌... 
లంచ్‌ తర్వాత కూడా బ్రూక్, స్మిత్‌ అంతే పట్టుదలతో బ్యాటింగ్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో బ్రూక్‌ కూడా 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. రెండో సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా కోల్పోని ఇంగ్లండ్‌ 28 ఓవర్లలో 106 పరుగులు జోడించింది. విరామానంతరం సిరాజ్‌ ఓవర్లో స్మిత్‌ స్వే్కర్‌ లెగ్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో పార్ట్‌నర్‌íÙప్‌ 300 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు ఈ జోడీని ఆకాశ్‌దీప్‌ విడదీశాడు. కొత్త బంతితో వేసిన మూడో ఓవర్లోనే బ్రూక్‌ను ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేయగా... తర్వాతి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్‌ ప్రమాదం తప్పింది. అయితే ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 587; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) నాయర్‌ (బి) సిరాజ్‌ 19; డకెట్‌ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; పోప్‌ (సి) రాహుల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 22; బ్రూక్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 158; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; స్మిత్‌ (నాటౌట్‌) 184; వోక్స్‌ (సి) నాయర్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 5; కార్స్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 0; టంగ్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 0; బషీర్‌ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్‌) 407.
వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25, 4–84, 5–84, 6–387, 7–395, 8–396, 9–407, 10–407. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 20–2–88–4, సిరాజ్‌ 19.3–3–70–6, ప్రసిధ్‌ 13–1–72–0, నితీశ్‌ రెడ్డి 6–0–29–0, జడేజా 17–2–70–0, సుందర్‌ 14–0–73–0. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీ) (బి) టంగ్‌ 28; రాహుల్‌ (బ్యాటింగ్‌) 28; నాయర్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 64. వికెట్ల పతనం: 1–51. బౌలింగ్‌: వోక్స్‌ 5–0–28–0, కార్స్‌ 5–1–23–0, టంగ్‌ 3–1–12–1.  

ఒకే ఓవర్లో 23 పరుగులు... 
ప్రసిధ్‌ కృష్ణ ఓవర్లో స్మిత్‌ చెలరేగిన తీరు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని స్మిత్‌ ఆ తర్వాత వరుసగా 4, 6, 4, 4, (వైడ్‌), 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి టెస్టులోనే ఆరుకు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ప్రసిధ్‌ ఈ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు.

క్యాచ్‌లు చేజారె... 
మూడో రోజు ఆటలో బ్రూక్, స్మిత్‌ జోరును నిలువరించేందుకు కొన్ని అవకాశాలు వచి్చనా అవి వృథా అయ్యాయి. మరీ సులువైనవి కాకపోయినా... మూడు క్యాచ్‌లు వదిలేయడం ఇంగ్లండ్‌కు మేలు చేసింది. జడేజా బౌలింగ్‌లో బ్రూక్‌ (వ్యక్తిగత స్కోరు 63) ఇచ్చిన క్యాచ్‌ను గిల్‌ అందుకోలేకపోయాడు. వేగంగా వచి్చన బంతి అతని తలకు కూడా తగిలింది. తన బౌలింగ్‌లోనే స్మిత్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ (స్కోరు 90)ను సుందర్‌ చేజార్చాడు. ఆ తర్వాత నితీశ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ (స్కోరు 121) ఇచి్చన క్యాచ్‌ను పంత్‌ నేలపాలు చేశాడు.

4  సిరాజ్‌ కెరీర్‌లో నాలుగో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నాలుగూ వేర్వేరు దేశాల్లో (ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌) రావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement