
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184 నాటౌట్) భారీ సెంచరీలు చేసి ఇంగ్లండ్‌ను గట్టెక్కించారు. 84 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు.
వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. బ్రూక్, స్మిత్ ద్వయం సగం వికెట్లు కోల్పోయినా డిఫెన్స్‌లో పడకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మిత్ 80, బ్రూక్ 137 బంతుల్లో సెంచరీలు పూర్తి చేశారు.
387 పరుగుల వద్ద బ్రూక్ ఔటయ్యాక ఇంగ్లండ్ మరో 20 పరుగుల వ్యవధిలో చివరి 5 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ అర్హమైన డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. అతనికి మరికొద్ది బంతులు అవకాశం దొరికినా డబుల్ పూర్తి చేసేవాడు. బ్రూక్‌ను ఆకాశ్‌దీప్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది.
ఆతర్వాత కొద్ది సేపటికే ఆకాశ్‌దీప్ క్రిస్ వోక్స్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. చివరి 3 వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు (డకెట్, పోప్, స్టోక్స్, కార్స్, టంగ్, బసీర్) డకౌట్ అయ్యారు.
క్రాలే 19, రూట్ 22, వోక్స్ 5 పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్కోర్‌లో 80 శాతం పరుగులు బ్రూక్, స్మిత్‌లే చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ (6/70), ఆకాశ్‌దీప్ (4/88) అద్భుతంగా బౌలింగ్ చేసి మొత్తం వికెట్లు తీశారు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా భారత్‌కు 180 పరుగుల కీలకమైన ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్.. శుక్రవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 28 పరుగుల చేసి ఔట్ కాగా.. కే ఎల్ రాహూల్ 28 , కరుణ్ నాయర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.