ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్‌..! | ENG VS IND 2nd Test Day 2: Ravindra Jadeja Missed Well Deserved Hundred | Sakshi
Sakshi News home page

ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్‌..!

Jul 3 2025 5:41 PM | Updated on Jul 3 2025 6:14 PM

ENG VS IND 2nd Test Day 2: Ravindra Jadeja Missed Well Deserved Hundred

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ లంచ్‌ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 

114 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్‌మన్‌ గిల్‌ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్‌ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో) వద్ద ఔటయ్యాడు.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్‌-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. గిల్‌తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా సెంచరీ మిస్‌ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. 

తొలి టెస్ట్‌లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్‌) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ జేమీ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్‌ విరామం సమయానికి గిల్‌ 168, వాషింగ్టన్‌ సుందర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

ఈ ఇన్నింగ్స్‌తో గిల్‌ విరాట్‌ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్‌ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్‌ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. 

ఇంగ్లండ్‌ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్‌ నిలిచాడు. 1990లో ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో మహ్మద్‌ అజారుద్దీన్‌ కెప్టెన్‌ హోదాలో 179 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement