ధోని, యువీ కాదు..! భారత్‌లో గ్రేటెస్ట్‌ సిక్స్‌ హిట్టర్‌ అతడే: ద్రవిడ్‌ | Rahul Dravid Names Greatest Six Hitter India Has Produced Not Dhoni, Sachin, Kohli, Yuvraj - Sakshi
Sakshi News home page

ధోని, యువీ కాదు..! టీమిండియాలో గ్రేటెస్ట్‌ సిక్స్‌ హిట్టర్‌ అతడే: ద్రవిడ్‌

Published Mon, Mar 11 2024 8:36 AM

Dravid Names Greatest Six Hitter India Has Produced Not Dhoni Sachin Kohli Yuvraj - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసలు కురిపించాడు. సిక్సర్లు బాదడంలో హిట్‌మ్యాన్‌ తనకు తానే సాటి అని కొనియాడాడు. భారత్‌లో ఇంత వరకు అలాంటి హిట్టర్‌ మరొకరు లేరని పేర్కొన్నాడు.

కాగా 2007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. వన్డేల్లో మూడు ద్విశతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. టెస్టుల్లో ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు చేశాడు.

ఇక సిక్సర్లు కొట్టడంలో రోహిత్‌ శర్మ ఎప్పుడూ ‘హిట్టే’! ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి అతడి ఖాతాలో 597 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన ఐదో టెస్టులోనూ రోహిత్‌ శర్మ విశ్వరూపం ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఇక ఈ టెస్టులో కూడా టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచిన రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ‍ద్రవిడ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ హిట్టింగ్‌ పవర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మా వాళ్లకు నా వీడియోలు చూపించాను. అందుకే అలా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నారు(నవ్వుతూ).. జోక్స్‌ పక్కన పెడితే.. ఈ ఫార్మాట్లో ఎవరైనా సిక్స్‌లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. 

మనకు రోహిత్‌ శర్మ లాంటి గొప్ప సిక్స్‌ హిట్టర్‌ ఉన్నాడు. షాట్‌ బాదడంలో తన పవర్‌, నైపుణ్యం అద్భుతం’’ అని కితాబులిచ్చాడు. టీమిండియాలో ఇంతవరకు అతడిలా సిక్సర్లు బాదిన ఆటగాడు మరొకరు లేరని ద్రవిడ్‌ జియో సినిమా షోలో ఈమేరకు వ్యాఖ్యానించాడు. కాగా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా టీమిండియాలో గొప్ప సిక్స్‌ హిట్టర్లుగా పేరొందిన విషయం తెలిసిందే.

చదవండి: IPL 2024: వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement