జాక్‌పాట్‌!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్‌ కొడుకు | Sehwag Elder Son Aaryavir Hits Jackpot And Younger Son Vedant Goes Unsold At Delhi Premier League 2025 Auction | Sakshi
Sakshi News home page

DPL 2025: భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్‌ కొడుకు.. కాస్ట్‌లీ ప్లేయర్‌ మాత్రం అతడే!

Jul 7 2025 8:14 AM | Updated on Jul 7 2025 10:28 AM

DPL: Sehwag Elder Son Aaryavir Hits Jackpot Younger Son Vedant Unsold

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.

డబుల్‌ సెంచరీ వీరుడు
కాగా ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్‌-19 క్రికెట్‌ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్‌ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్‌.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్‌ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.

కాగా టెస్టుల్లో సెహ్వాగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఫెరారీ మిస్‌ అయ్యావు
‘‘టెస్టు క్రికెట్‌లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్‌ క్రికెట్‌లోనైనా నా హయ్యస్ట్‌ స్కోరు 319 పరుగుల బెంచ్‌ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్‌ గతంలో చెప్పాడు.

ఇక తన కుమారుడు ఆర్యవీర్‌ 2024లో ఈ ఫీట్‌ను మిస్‌ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్‌. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్‌ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్‌ సెంచరీలు, ట్రిపుల్‌ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు.

అమ్ముడుపోని వేదాంత్‌
కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్‌ను సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్‌ చిన్న కుమారుడు వేదాంత్‌ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్‌ కంటే ముందే వేదాంత్‌ పేరు వేలంలోకి వచ్చింది.

ఖరీదైన ఆటగాడిగా సన్‌రైజర్స్‌ప్లేయర్‌
కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌-2025 వేలంలో సిమర్‌జీత్‌ సింగ్‌ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్‌ కింగ్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్‌ పేసర్‌ ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లలోనూ సిమర్‌జీత్‌ భాగమయ్యాడు.

మరోవైపు.. రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ నితీశ్‌ రాణాను వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో భాగమైన జట్లు ఇవే
సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌, ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌, సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌, నార్త్‌ ఢిల్లీ స్ట్రైకర్స్‌, వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్‌ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్‌లో ఈస్ట్‌ ఢిల్లీ రైడర్స్‌ విజేతకాగా.. సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌ రన్నరప్‌గా నిలిచింది.

చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్‌హామ్‌లో జైహింద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement