
అచ్చిరాని వేదికపై భారత్ చిరస్మరణీయ విజయం
తొమ్మిదో ప్రయత్నంలో ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో టీమిండియాకు దక్కిన తొలి గెలుపు
రెండో టెస్టులో 336 పరుగులతో శుబ్‌మన్ గిల్ బృందం జయభేరి
6 వికెట్లతో హడలెత్తించిన ఆకాశ్‌దీప్
గురువారం నుంచి లార్డ్స్‌లో మూడో టెస్టు
బుమ్రాకు విశ్రాంతినివ్వడం... కుల్దీప్‌ను విస్మరించడం... ప్రసి«ద్‌ను కొనసాగించడం... టాపార్డర్‌ను కూల్చిన అనంతరం ప్రత్యర్థిని కోలుకోనివ్వడం... సరైన సమయంలో ఇన్నింగ్స్ ‘డిక్లేర్’ చేయకపోవడం... ఇన్ని ప్రతికూలతలకు తోడు చివరి రోజు వర్షం సైతం ఆతిథ్య జట్టును ఆదుకునేలా కనిపించడంతో.. ఒకదశలో భారత విజయంపై నీలినీడలు కమ్ముకోగా... ఆకాశ్‌దీప్ సింగ్ వాటిని పటాపంచలు చేస్తూ విజృంభించాడు.
యువసారథి శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్ మెరుపులకు... ఆకాశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తోడవడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. నాలుగేళ్ల క్రితం ‘గబ్బా స్టేడియం’లో ఆ్రస్టేలియాపై తొలి విజయంలో కీలకపాత్ర పోషించిన గిల్, పంత్, సిరాజ్... ఇక్కడ కూడా సత్తా చాటడంతో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి టెస్టుల్లో గెలిచింది. గతంలో ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ 8 టెస్టులు ఆడగా ... ఏడింటిలో ఓడి... ఒకసారి ‘డ్రా’ చేసుకుంది. తొమ్మిదో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది.
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలిసారి టెస్టు ఫార్మాట్‌లో విజయం నమోదు చేసుకుంది. బ్యాటర్ల బీభత్సానికి బౌలర్ల సహకారం తోడవడంతో రెండో టెస్టులో టీమిండియా 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. విదేశాల్లో పరుగుల తేడా పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 72/3తో ఆదివారం చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు చివరకు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది.
జేమీ స్మిత్ (99 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. భారీ వర్షం కురవడంతో ... చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ఒకదశలో వరుణుడి సాయంతో ఇంగ్లండ్ గట్టెక్కేలా కనిపించినా... వాన తెరిపినిచి్చన అనంతరం భారత బౌలర్లు విజృంభించి ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆకాశ్‌దీప్ 6 వికెట్లతో అదరగొట్టగా... సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జడేజా, సుందర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు ఇదే మొదటి గెలుపు కాగా... ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1–1తో సమం చేసింది. భారత కెప్టెన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. లార్డ్స్‌లో గురువారం నుంచి మూడో టెస్టు జరుగుతుంది.
మళ్లీ అతడే...
వర్షంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ఆట ప్రారంభం కావడంతో ఓవర్లను కుదించారు. దీంతో ఏ మూలో భారత విజయంపై అనుమానాలు రేకెత్తగా... వాటిని ఆకాశ్‌దీప్ పటాపంచలు చేశాడు.
రెండో ఓవర్ తొలి బంతికే పోప్ (24)ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆకాశ్... తదుపరి ఓవర్‌లో బ్రూక్ (23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ ఆత్మరక్షణలో పడగా... లంచ్ విరామానికి ముందు కెప్టెన్ బెన్ స్టోక్స్ (73 బంతుల్లో 33; 6 ఫోర్లు)ను అవుట్ చేయడం ద్వారా సుందర్ జట్టును విజయానికి మరింత చేరువ చేశాడు. ఇక గెలుపు లాంఛనం మాత్రమే మిగలగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జేమీ స్మిత్ ఎదురుదాడికి దిగాడు. ధాటిగా ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన స్మిత్ మరో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది.

స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 587;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 407;
భారత్ రెండో ఇన్నింగ్స్: 427/6 డిక్లేర్డ్;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డకెట్ (బి) ఆకాశ్‌దీప్ 25; క్రాలీ (సి) (సబ్) సుదర్శన్ (బి) సిరాజ్ 0; పోప్ (బి) ఆకాశ్‌దీప్ 24; రూట్ (బి) ఆకాశ్‌దీప్ 6; బ్రూక్ (ఎల్బీ) ఆకాశ్‌దీప్ 23; స్టోక్స్ (ఎల్బీ) (బి) సుందర్ 33; స్మిత్ (సి) సుందర్ (బి) ఆకాశ్‌దీప్ 88; వోక్స్ (సి) సిరాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 7; కార్స్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 38; టంగ్ (సి) సిరాజ్ (బి) జడేజా 2; బషీర్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 13;
మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్) 271.
వికెట్ల పతనం: 1–11, 2–30, 3–50, 4–80, 5–83, 6–153, 7–199, 8–226, 9–246, 10–271.
బౌలింగ్: ఆకాశ్‌దీప్ 21.1–2–99–6; సిరాజ్ 12–3–57–1; ప్రసిధ్ కృష్ణ 14–2–39–1; జడేజా 15–4–40–1; సుందర్ 6–2–28–1.