‘వాళ్ల దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుతదీపం లేదు.. తప్పంతా మీదే’ | Do Not Have Aladdin ka Chirag CAT Holds RCB Responsible For Stampede | Sakshi
Sakshi News home page

‘వాళ్ల దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుతదీపం లేదు.. తప్పంతా మీదే’

Jul 1 2025 5:16 PM | Updated on Jul 1 2025 5:37 PM

Do Not Have Aladdin ka Chirag CAT Holds RCB Responsible For Stampede

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) యాజమాన్యం తీరును కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (CAT) తప్పుబట్టింది. ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం మేనేజ్‌మెంటే అని తేల్చిచెప్పింది. ఐపీఎల్‌లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు ఆర్సీబీ.

తీరిన కల
ఇందుకు ప్రధాన కారణం టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి (Virat Kohli). 2008 నుంచి ఇప్పటిదాకా అదే జట్టుతో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్‌. అయితే, పదిహేడేళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్‌ ట్రోఫీ ఈసారి ఆర్సీబీ సొంతమైంది. ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ టైటిల్‌ సొంతం చేసుకుంది. దీంతో కోహ్లి, ఆర్సీబీ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

తీవ్ర విషాదం
ఫ్రాంఛైజీ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునే క్రమంలో అభిమానులకు పిలుపునివ్వడం విషాదకర ఘటనకు దారితీసింది. అహ్మదాబాద్‌ నుంచి ట్రోఫీతో బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికే క్రమంలో.. జూన్‌ 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా యాభై మంది గాయాలపాలయ్యారు. దీంతో ఆర్సీబీ, కర్ణాటక ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చాయి.

తప్పంతా మీదే
ఈ నేపథ్యంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ వికాస్‌ కుమార్‌పై వేటు పడింది. ఈ క్రమంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ వద్దకు విషయం చేరగా.. మంగళవారం విచారణ చేపట్టిన ట్రిబ్యునల్‌ ఆర్సీబీ యాజమాన్యానిదే ఈ దుర్ఘటనకు బాధ్యత అని స్పష్టం చేసింది. వికాస్‌ కుమార్‌ను వెంటనే తన పదవిలో తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా పోలీసులను సస్పెండ్‌ చేయడం సరికాదని పేర్కొంది.

ఈ మేరకు.. ‘‘ఆర్సీబీ పోలీసుల నుంచి సరైన రీతిలో అనుమతి తీసుకోలేదు. వారి నుంచి ఆమోదమూ పొందలేదు. అకస్మాత్తుగా.. విజయోత్సవం గురించి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ చేసింది. దీంతో పెద్ద ఎత్తున జనసమూహం చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకుంది.

వాళ్ల దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుతదీపం లేదు
అయితే, పన్నెండు గంటల్లోనే స్టేడియం వద్ద ఏర్పాట్లు చేయడం పోలీసులకు సాధ్యపడలేదు. నిజానికి వారికి మరింత సమయం ఇవ్వాల్సింది. పోలీసులు కూడా మనుషులే. వాళ్లేమీ దేవుళ్లో.. లేదంటే ఇంద్రజాలికులో కాదు.

ఇలా అనుకోగానే.. అలా ఏర్పాట్లు చేయడానికి వారి వద్ద అల్లావుద్దీన్‌ అద్భుత దీపమేమీ లేదు’’ అంటూ ఆర్సీబీకి చివాట్లు పెట్టి​ంది కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌. అదే సమయంలో పోలీసుల పట్ల సహానుభూతి వ్యక్తం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ సంబంధిత వివాదాలను క్యాట్‌ పరిష్యరిస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది.

చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement