'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'

Dhoni Pays-Tribute-CSK Star Ambati Rayudu-Lot-Like-Me-Farewell IPL-Match - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ అనంతరం సీఎస్‌కే స్టార్‌ అంబటి రాయుడు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్‌కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్‌కే టైటిల్స్‌ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ రాయుడు తన ఇంపాక్ట్‌ చూపించాడు.

వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్‌ ఫిక్స్‌ చేయడంతో సీఎస్‌కే బ్యాటర్స్‌ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి  8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగుల దనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్‌ సీఎస్‌కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. 

ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్‌ను, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్‌ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు.

కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్‌ కెరీర్‌ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్‌ కెరీర్‌ మొత్తంలో 203 మ్యాచ్‌లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్‌ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top