అచ్ఛా... చల్తా హూ... | Arijit Singh Retires From Playback Singing | Sakshi
Sakshi News home page

అచ్ఛా... చల్తా హూ...

Jan 29 2026 5:17 AM | Updated on Jan 29 2026 5:17 AM

Arijit Singh Retires From Playback Singing

న్యూస్‌మేకర్‌

‘అచ్ఛా... చల్తా హూ... దువావోంమే యాద్‌ రఖ్‌నా’... ఇది అర్జిత్‌ సింగ్‌ సూపర్‌ హిట్‌ పాట. వీడ్కోలును సూచించే పాట ఇది. అర్జిత్‌ సింగ్‌ తన కెరీర్‌ పీక్‌లో ఉండగా 38 ఏళ్ల వయసుకే రిటైర్మెంట్‌ ప్రకటించడం ఇప్పుడు సంగీతాభిమానులకు అశనిపాతంగా ఉంది. అయితే తాను కేవలం సినిమా ప్లేబ్యాక్‌కు మాత్రమే  దూరమవుతున్నానని అర్జిత్‌ ప్రకటించడం కొద్దిలో కొద్ది ఊరట. అర్జిత్‌ నిర్ణయం వెనుక.. అర్జిత్‌ స్వభావం పై కథనం....

‘తుమ్‌ హి హో’ అంటూ ‘ఆషికీ2’తో, ‘అచ్ఛా చల్తా హు’ అంటూ ‘అయ్‌ దిల్‌ హై ముష్కిల్‌’ తో దుమారం రేపి ఆ తర్వాత వందలాది పాటలతో దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న గాయకుడు అర్జిత్‌ సింగ్‌ తన ప్లేబ్యాక్‌ సింగింగ్‌కు గుడ్‌బై చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. క్రీడాకారులకు రిటైర్మెంట్‌ ఉండొచ్చేమోగాని ప్లేబ్యాక్‌ సింగర్లకు పాడినంత కాలం అవకాశాలు ఉంటాయి. అందునా అర్జిత్‌ సింగ్‌ వంటి స్టార్‌ సింగర్‌కు డైరీ నిండిపోయేనన్ని పాటలున్నాయి. అయినా సరే అర్జిత్‌ సింగ్‌ రిటైర్‌మెంట్‌ తీసుకోవడం పట్ల అభిమానులు డిజ΄్పాయింట్‌ అయినా కొంతమంది ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెబుతున్నారు. అర్జిత్‌ తెలుగులో కూడా దాదాపు పాతిక పాటలు పాడాడు.

అదే కారణం...
అర్జిత్‌ సింగ్‌ ముందు నుంచి కూడా బాలీవుడ్‌ తరహా లగ్జరీ జీవితాన్ని ఇష్టపడేవాడు కాదు. అతనికి తను పుట్టి పెరిగిన పశ్చిమ బెంగాల్‌లోని జియాగంజ్‌ అనే ఊరు ఇష్టం. అతని తల్లి బెంగాలి. తండ్రి పంజాబీ శిక్కు. ముంబై అంధేరిలో అతనికి ఇల్లు, కోట్ల రూపాయల డబ్బు ఉన్నా నేటికీ ఎక్కువగా జియాగంజ్‌లోనే బైక్‌ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. మామూలు యువకుడిలా అందరితో కలిసి క్రికెట్‌ ఆడుతుంటాడు. ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఉండాలంటే మ్యూజిక్‌ డైరెక్టర్ల ఇష్టానుసారం, సినిమాల అర్జెన్సీని బట్టి రికార్డింగ్స్‌కు హాజరు కావాలి. అదొక్కటే కాక హీరోల, మ్యూజిక్‌ డైరెక్టర్ల ఇష్టాఇష్టాల రాజకీయాలు కూడా ఉంటాయి.

 ఇవన్నీ అర్జిత్‌కు నచ్చకపోయి ఉండొచ్చు. గతంలో సల్మాన్‌ఖాన్‌ ఒక వేడుకను హోస్ట్‌ చేస్తూ అవార్డు తీసుకోవడానికి స్టేజ్‌ మీదకు వచ్చిన అర్జిత్‌ను చూసి ‘కొంచెం నీట్‌గా తయారయ్యి రావొచ్చుగా. నిద్రలో లేచి వచ్చినట్టు ఉన్నావు’ అన్నాడు. దానికి అర్జిత్‌ సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంతో ‘సుల్తాన్‌’లో అర్జిత్‌ పాడిన పాటను వేరొకరికి ఇచ్చారు. తర్వాత అర్జిత్‌ సల్మాన్‌కు బహిరంగంగా సారీ చె΄్పాల్సి వచ్చింది. ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. తాజాగా సల్మాన్‌ఖాన్‌ చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ కోసం అర్జిత్‌ పాడాడు. కాదన్న సల్మాన్‌ ఖాన్‌కు పాట పాడటంతో తన ప్రయాణం ముగిసిందని అర్జిత్‌ భావించి ఉండొచ్చు.

లైవ్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా...
అర్జిత్‌ సింగ్‌ లైవ్‌ ప్రోగ్రామ్స్‌కు వేలాదిగా తరలి వచ్చే అభిమానులు ఉన్నారు. అమెరికా, గల్ఫ్‌ దేశాలలో అర్జిత్‌ కచ్చేరీలు భారీ హంగామాగా జరుగుతాయి. అందులో పెద్ద రాబడి కూడా ఉంటుంది. ప్లేబ్యాక్‌ సింగర్లకు ఇచ్చే పారితోషికంతో పోలిస్తే ఈ డబ్బు చాలా ఎక్కువ. అందువల్ల కూడా అర్జిత్‌ ప్లేబ్యాక్‌ సింగింగ్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించి ఉండొచ్చు. ఇకపై అర్జిత్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా, ప్రయివేట్‌ ఆల్బమ్స్‌ గాయకుడిగా, లైవ్‌ సింగర్‌గా తన జర్నీ ద్వారా ప్రేక్షకులను కలుస్తూనే ఉంటాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement