తన గాత్రంతో ప్రేమ పల్లకిలో ఊరేగిస్తాడు.. అంతలోనే అలక తెప్పిస్తాడు. సడన్‌గా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. అలా అర్జిత్ సింగ్ గొంతు పలికించే భావాలకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో వందలాది పాటలు పాడాడు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ ప్రతిభ చూపిన ఆయన సడన్‌గా సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశాడు.
సడన్‌గా ఎందుకిలా?
అయితే ఉన్నపళంగా సినిమా పాటలకు విరామం ప్రకటించడం వెనక కారణాలేమై ఉంటాయని అభిమానులు చర్చ మొదలుపెట్టారు. ఇంతలో అతడే తన రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని వెల్లడించాడు. ఇప్పటివరకు సినిమా పాటల రూపంలో అలరించిన అర్జిత్ సింగ్ మరో రూపంలో ముందుకు రానున్నట్లు ప్రకటించాడు.
సంగీతంలో కొత్త అంశాలు నేర్చుకోవాలని..
ఆయన మాట్లాడుతూ.. రిటైర్‌మెంట్‌కు ఒక్క కారణమంటూ లేదు. చాలా అంశాలు భాగమై ఉన్నాయి. చాలారోజులుగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ధైర్యం కూడదీసుకుని మీతో పంచుకున్నాను. నాకు పాటల్ని ఒకేలా పాడటం ఇష్టముండదు. అందుకే వేదికలపై దాన్ని కాస్త మార్చి పాడుతుంటాను. నేను ఇండస్ట్రీలో చాలా త్వరగా ఎదిగాను. ఇక్కడే ఆగిపోకుండా ఇంకా డిఫరెంట్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాను. ఇండిపెండెంట్ సంగీతంపై దృష్టి సారిస్తాను.
పూర్తి చేస్తా..
మరో విషయం ఏంటంటే.. కొత్త గాయకుల పాటలు వినాలనుంది. వాళ్లు తమ టాలెంట్‌తో నాకు స్ఫూరిస్తున్నారు. కాబట్టి వారిని ప్రోత్సహించాలన్నది కూడా ఒక కారణం అని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే ఒప్పుకున్న పాటల్ని మధ్యలో వదిలేయనని.. వాటిని పూర్తి చేసి తీరతానని వెల్లడించాడు.
సినిమా
అర్జిత్ సింగ్.. హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ.. ఇతర భాషల్లోనూ పాటలు పాడాడు. కనులను తాకే ఓ కల.. (మనం), అదేంటి ఒక్కసారి.. (స్వామి రారా), దేవ.. దేవ.. (బ్రహ్మాస్త్ర) ఇలా ఎన్నో సాంగ్స్ ఆయన పాడినవే! సంగీతరంగంలో అతడు అందించిన సేవలకు గానూ అర్జిత్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. సినిమా పాటలు ఇకపై పాడనన్న అర్జిత్.. ఇండిపెండెంట్ సింగర్‌గా ప్రయాణం మొదలుపెట్టబోతున్నాడన్నమాట!


