
మరో ఆరుగురికి కూడా చోటు
లండన్: భారత మాజీ కెప్టెన్, సారథిగా టి20, వన్డే వరల్డ్ కప్‌లను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సముచిత రీతిలో గౌరవించింది. ఐసీసీ ప్రకటించిన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో ధోనికి చోటు కల్పించింది. 2025 ఏడాదికిగాను ధోనితో పాటు మరో ఆరుగురు ప్లేయర్లు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపికయ్యారు. గ్రేమ్ స్మిత్, హాషిమ్ ఆమ్లా, మాథ్యూ హేడెన్, డేనియెల్ వెటోరిలతో పాటు మహిళా క్రికెటర్లు సారా టేలర్, సనా మీర్‌లను ఐసీసీ ఎంపిక చేసింది.
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌గా ధోని గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని నాయకత్వంలోనే భారత్ 2007 టి20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు సాధించిన ధోని... వికెట్ కీపర్‌గా 824 మందిని అవుట్ చేయడంలో భాగస్వామిగా ఉన్నాడు.
‘ప్రపంచ క్రికెట్‌లో ఆటగాళ్లు చేసిన సేవలకు గుర్తింపుగా భావించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. ఎంతోమంది దిగ్గజాల సరసన నా పేరు కూడా చేరడం గొప్ప అనుభూతి. ఎప్పటికీ చిరస్మరణీయం’ అని ధోని స్పందించాడు.
మాథ్యూ హేడెన్ (ఆ్రస్టేలియా): టెస్టుల్లో ఓపెనర్‌గా 50కి పైగా సగటుతో ఆసీస్ ఘనవిజయాల్లో కీలకంగా నిలిచిన హేడెన్ రెండు వన్డే వరల్డ్ విజయాల్లో సభ్యుడు.
గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా): ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా (109) వ్యవహరించడంతో పాటు అత్యధిక విజయాలు (53) సాధించిన రికార్డు స్మిత్ సొంతం.
హాషిమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా): సుదీర్ఘ కాలం టెస్టుల్లో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన ఆమ్లా సఫారీ టీమ్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు.
డేనియెల్ వెటోరీ (న్యూజిలాండ్): టెస్టు క్రికెట్‌లో 4 వేలకు పైగా పరుగులు చేసిన 300కు పైగా వికెట్లు తీసిన అరుదైన ఆటగాళ్లలో ఒకడైన వెటోరీ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుర్తింపు పొందాడు.
సారా టేలర్ (ఇంగ్లండ్): మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందిన సారా టేలర్ 2 వన్డే వరల్డ్ కప్, ఒక టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో సభ్యురాలు.
సనా మీర్ (పాకిస్తాన్): 14 ఏళ్ల కెరీర్‌లో 120 వన్డేలు, 106 టి20లు ఆడిన సనా మీర్ పాకిస్తాన్ మహిళా క్రికెట్‌కు పెద్ద దిక్కులా నిలబడింది. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కిన తొలి పాక్ మహిళా క్రికెటర్‌గా సనా గుర్తింపు పొందనుంది.
11 ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు పొందిన భారత క్రికెటర్లు. సునీల్ గావస్కర్ (2009), బిషన్ బేడీ (2009), కపిల్ దేవ్ (2010), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018), సచిన్ టెండూల్కర్ (2019), వినూ మన్కడ్ (2021), డయానా ఎడుల్జీ (2023), వీరేంద్ర సెహ్వాగ్ (2023), నీతూ డేవిడ్ (2024), మహేంద్ర సింగ్ ధోని (2025) ఈ జాబితాలో ఉన్నారు.