ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో నీతూ డేవిడ్‌ | Neetu David becomes second Indian women cricketer to be inducted into ICC Hall of Fame | Sakshi
Sakshi News home page

ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో నీతూ డేవిడ్‌

Oct 17 2024 4:46 AM | Updated on Oct 17 2024 7:34 AM

Neetu David becomes second Indian women cricketer to be inducted into ICC Hall of Fame

ఈ గౌరవం అందుకున్న రెండో భారత మహిళా క్రికెటర్‌

కుక్, డివిలియర్స్‌లకూ చోటు

దుబాయ్‌: భారత మాజీ మహిళా క్రికెటర్‌ నీతూ డేవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో నీతూకు చోటు లభించింది. మాజీ ఆటగాళ్లు అలిస్టర్‌ కుక్‌ (ఇంగ్లండ్‌), ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా)లతో పాటు నీతూకు కూడా ఈ జాబితాలో చోటు కల్పిస్తున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది.

 డయానా ఎడుల్జీ తర్వాత భారత్‌ నుంచి ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో స్థానం దక్కించుకున్న రెండో మహిళా క్రికెటర్‌ నీతూ డేవిడ్‌ కావడం విశేషం. ‘ఇలాంటి గౌరవం దక్కడం పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్‌ తరఫున ఆడినందుకు నాకు లభించిన జీవితకాలపు గుర్తింపుగా దీనిని భావిస్తున్నా. నా క్రికెట్‌ ప్రయాణంలో ఇది ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుంది. నాకు అన్ని విధాలా అండగా నిలిచిన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, బీసీసీఐతో పాటు నన్ను గుర్తించిన ఐసీసీకి కృతజ్ఞతలు’ అని నీతూ డేవిడ్‌ స్పందించింది.  

పలు ఘనతలు... 
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన నీతూ డేవిడ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా భారత్‌ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు (1995–2008 మధ్య) ఆడింది. వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిన ఆమె ఓవరాల్‌గా వన్డేల్లో కేవలం 16.34 సగటుతో 141 వికెట్లు పడగొట్టి భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 

మహిళల టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన (8/53) నీతూ పేరిటే ఉంది. 1995లో ఇంగ్లండ్‌పై జంషెడ్‌పూర్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. 3 వన్డే వరల్డ్‌ కప్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నీతూ 2005 టోరీ్నలో 20 వికెట్లు తీసి భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించింది. ఆట నుంచి రిటైర్‌ అయ్యాక నీతూ డేవిడ్‌ ప్రస్తుతం భారత మహిళల జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా వ్యవహరిస్తోంది.  

టెస్టుల్లో పరుగుల వరద...
ఇంగ్లండ్‌ మాజీ కెపె్టన్‌ అలిస్టర్‌ కుక్‌ ఆ జట్టు అత్యుత్తమ టెస్టు విజయాల్లో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇటీవల రూట్‌ అధిగమించే వరకు ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగుల ఘనత అతని పేరిటే ఉంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఆ్రస్టేలియా గడ్డపై యాషెస్‌ గెలిచేందుకు దోహదం చేసిన అతను 
కెపె్టన్‌గా రెండు సార్లు స్వదేశంలో యాషెస్‌ సిరీస్‌ను గెలిపించాడు. 2012లో భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడంలో కూడా అతనిదే ప్రధాన పాత్ర. కుక్‌ 161 టెస్టుల్లో 45.35 సగటుతో 33 సెంచరీలు సహా 12,472 పరుగులు సాధించాడు.  

విధ్వంసానికి మారుపేరు... 
ఈతరం క్రికెట్‌ అభిమానులకు అత్యుత్తమ వినోదం అందించిన ఆటగాళ్లలో డివిలియర్స్‌ అగ్రభాగాన ఉంటాడు. క్రీజ్‌లోకి దిగితే చాలు తనకే సాధ్యమైన వైవిధ్యభరిత షాట్లతో మైదానం అంతా పరుగుల విధ్వంసం సృష్టించడంలో ఏబీ దిట్ట. వన్డేల్లో వేగవంతమైన 50 (16 బంతుల్లో), 100 (31 బంతుల్లో), 150 (64 బంతుల్లో) అతని పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేసిన డివిలియర్స్‌... 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు సాధించాడు. 78 టి20ల్లో అతను జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement