సూర్యకుమార్ యాదవ్.. 30 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు సారథిగా కొనసాగుతున్న సూర్య.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. 2021లో భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన సూర్యకు సెలక్టర్లు చాలా అవకాశాలు ఇచ్చారు.
కానీ తనకు లభించిన అవకాశాలను మిస్టర్ 360 అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 37 వన్డేలు ఆడిన సూర్య 25.77 సగటుతో కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఈ ముంబై ఆటగాడికి ఛాన్స్ లభించింది. కానీ అక్కడ కూడా అతడు ఘోరంగా విఫలమయ్యాడు.
దీంతో అతడిని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. సూర్యను ప్రస్తుతం కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణిస్తారు. అయితే తనకు మాత్రం వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని తాజా ఇంటర్వ్యూలో సూర్య వెల్లడించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఎలా మెనెజ్ చేయాలో సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ నుంచి నేర్చుకుంటానని సూర్య తెలిపాడు. కాగా సూర్య టెస్టుల్లో కూడా భారత తరపున డెబ్యూ చేశాడు.
"ఒకవేళ ఏబీ డివిలియర్స్‌ను నేను కలిస్తే టీ20లు, వన్డేల్లో తన ఆటను ఎలా బ్యాలెన్స్ చేశాడో తెలుసుకోవాలనకుంటున్నాను. నేను మాత్రం రెండింటిని మెనెజ్ చేయలేకపోయాను. వన్డేలు కూడా టీ20ల మాదిరిగా ఆడాలని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు.
ఏబీ ఈ ఇంటర్వ్యూ మీరు చూసినట్లయితే దయచేసి త్వరగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు మూడు-నాలుగేళ్ల కెరీర్ ఇంకా ఉంది. వన్డేల్లో నేను రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి నాకు సాయం చేయండి. నేను టీ20లు, వన్డేలు రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయాను" అని విమల్ కుమార్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య పేర్కొన్నాడు. అయితే సూర్య ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు.
ఈ ఏడాది టీ20ల్లో సూర్య ఇప్పటివరకు ఒక్కసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటలేకపోయాడు. కెప్టెన్‌గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం సూర్య నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో సూర్య బీజీబీజీగా ఉన్నాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు


