ఏ క్రీడలో అయినా దేశానికి ప్రాతినిథ్యం వహించడం క్రీడాకారులందరి కల. ఇందు కోసం సర్వశక్తులు ఒడ్డి, ఎంతో శ్రమించి, చాలా త్యాగాలు, పోరాటాలు చేస్తారు. ఒక్క క్రీడలో దేశానికి ప్రాతినిథ్యం వహించాలంటేనే ఇన్ని కష్టాలు ఎదర్కోవాల్సి వస్తే.. కొందరు ఒకటికి మించిన క్రీడల్లో జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ క్రీడాకారులపై ఓ లుక్కేద్దాం.
ఈ టాపిక్ డిస్కషన్‌కు రాగానే ముందుగా ఇద్దరు మహిళా క్రికెటర్లు గుర్తుకు వస్తారు. వారిలో మొదటి పేరు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సూజీ బేట్స్ కాగా.. రెండో పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ. ఈ ఇద్దరు వారి దేశాల తరఫున క్రికెట్‌తో పాటు మరో క్రీడలో పాల్గొన్నారు.
సూజీ బేట్స్
సూజీ న్యూజిలాండ్ తరఫున క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ ఆడింది. ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె.. 2008 Beijing Olympicsలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. బాస్కెట్‌బాల్‌లో ఆమె పలు అంతర్జాతీయ టోర్నీల్లోనూ పాల్గొంది. ప్రస్తుతం సూజీ బాస్కెట్‌బాల్‌ను వదిలి క్రికెట్‌పై దృష్టి సారించింది.
ఎల్లిస్ పెర్రీ
17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పెర్రీ.. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. ఆమె 2011 FIFA Women’s World Cupలో ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది.
పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా చాలా మంది మల్టీ టాలెండెడ్ ఉన్నారు.
యుజ్వేంద్ర చహల్
ఐపీఎల్‌లో మెరిసి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న చహల్.. చెస్ క్రీడలోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. World Chess Federationలో చహల్ పేరు నమోదై ఉంది. భారత్ తరఫున క్రికెట్ & చెస్ ఆడిన ఏకైక ఆటగాడు చహల్.
ఏబీ డివిలియర్స్
మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ కావడంతో పాటు ఆ దేశం తరఫున జూనియర్ లెవెల్లో టెన్నిస్ కూడా ఆడాడు. అలాగే స్విమ్మింగ్, రగ్బీ, గోల్ఫ్, బాడ్మింటన్, అథ్లెటిక్స్ వంటి అనేక క్రీడల్లోనూ ఏబీకి ప్రావీణ్యం ఉంది. మల్టీ టాలెంటెడ్ పదానికి ఏబీ నిజమైన అర్హుడని చాలామంది అంటుంటారు.
జాంటీ రోడ్స్
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్.. సౌతాఫ్రికా తరఫున క్రికెట్‌తో పాటు హాకీ ఆడే అవకాశం కూడా వచ్చింది. 1992, 1996 ఒలింపిక్స్ సౌతాఫ్రికా హాకీ జట్టుకు రోడ్స్ ఎంపికయ్యాడు. అయితే వేర్వేరు కారణాల వల్ల అతను హాకీలో దేశానికి ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.
ఆండ్రూ ఫ్లింటాఫ్
ఈ ఆల్‌రౌండ్ దిగ్గజం ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు బాక్సింగ్ క్రీడలోనూ సత్తా చాటాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ఫ్లింటాఫ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారాడు. ఈ క్రీడలోనూ అతను అత్యున్నతాలను చూశాడు.
ఇయాన్ బోథమ్
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ముఖ్యుడైన ఇయాన్ బోథమ్.. ఇంగ్లండ్ తరఫున క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆడాడు. క్రికెట్ ఆడే సమయంలోనే బోథమ్ పలు క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నాడు.
సర్ వివియన్ రిచర్డ్
బ్యాటింగ్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్ వెస్టిండీస్ తరఫున క్రికెట్ ఆడటంతో పాటు ఓ కరీబియన్ దీవి తరఫున ఫుట్‌బాల్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి చేరకముందే 1974 FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో Antigua & Barbuda దేశానికి ప్రాతినిథ్యం వహించాడు.


