చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ చిచ్చరపిడుగు | DC Youngster Sameer Rizvi Smashes Consecutive Fifties In UP T20 League | Sakshi
Sakshi News home page

చెలరేగిపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ చిచ్చరపిడుగు

Aug 25 2025 8:54 PM | Updated on Aug 25 2025 8:54 PM

DC Youngster Sameer Rizvi Smashes Consecutive Fifties In UP T20 League

ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఆటగాడు సమీర్‌ రిజ్వి (21) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో కాన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. వరుస విధ్వంసాలతో హోరెత్తిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట గోరఖ్‌పూర్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 93 పరుగులు చేసిన రిజ్వి.. ఇవాళ మీరట్‌ మెవెరిక్స్‌పై అజేయమైన మెరుపు అర్ద శతకంతో (48 బంతుల్లో 78) మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో రిజ్వి మెరుపు ఇన్నింగ్స్‌కు లక్‌ కూడా తోడవ్వడంతో కాన్పూర్‌ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాన్పూర్‌.. మీరట్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాన్పూర్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వి ఒక్కడే రాణించాడు.

సహచరులు ఒక్కో పరుగు సాధించేందుకు ఇబ్బంది పడుతుండగా.. రిజ్వి భారీ షాట్లతో చెలరేగాడు. 7 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్‌లో రిజ్వి ఒక్కడే సగానికి పైగా చేశాడు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన మీరట్‌ను వరుణుడి రూపంలో దురదృష్టం వెంటాడింది. ఆ జట్టు స్కోర్‌ 41/2 వద్ద (8 ఓవర్ల తర్వాత) ఉండగా భారీ వర్షం​ మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోగా డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిన కాన్పూర్‌ను విజేతగా ప్రకటించారు. 

మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి మీరట్‌ గెలుపుకు 14 పరుగుల దూరంలో (డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) ఉండింది. ఆర్సీబీ యువ ఆటగాడు స్వస్తిక్‌ చికారా (29), మాధవ్‌ కౌశిక్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు.

కాగా, సమీర్‌ రిజ్వి గత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు పెద్దగా రాణించకపోయినా, చివరి మ్యాచ్‌లో ఒత్తిడిలో అజేయమైన అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. యూపీ లీగ్‌లో తాజా ప్రదర్శనలతో రిజ్వి మరోసారి డీసీ మేనేజ్‌మెంట్‌ దృష్టిలో పడి ఉంటాడు. ఈ ప్రదర్శనలు అతడికి మరిన్ని ఐపీఎల్‌ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement