సంచలన ప్రదర్శన అనంతరం స్టార్క్‌కు మొండిచెయ్యి | Cheteshwar Pujara names best Test XI, backs KL Rahul and snubs Mitchell Starc | Sakshi
Sakshi News home page

సంచలన ప్రదర్శన అనంతరం స్టార్క్‌కు మొండిచెయ్యి

Aug 22 2026 3:09 PM | Updated on Aug 22 2026 3:51 PM

Cheteshwar Pujara names best Test XI, backs KL Rahul and snubs Mitchell Starc

source: X

భారత మాజీ టెస్టు బ్యాటర్‌ చటేశ్వర్‌ పుజారా ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు కల్పించిన పుజారా.. టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌పై తన నమ్మకాన్ని మరోసారి చాటుకున్నాడు. 

అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌కు మాత్రం మొండిచెయ్యి చూపాడు. ఈ జట్టులో పుజారా స్టార్క్‌కు చోటు ఇవ్వలేదు.

తాజాగా క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ పుజారా ఈ ప్రపంచ టెస్టు XIని వెల్లడించాడు. సాధారణ పిచ్‌పై ఆడే మ్యాచ్‌ కోసమే ఈ జట్టును ఎంపిక చేసినట్లు చెప్పాడు. ఇంగ్లండ్‌ లేదా ఆస్ట్రేలియా వంటి పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో మాత్రం స్పిన్నర్‌ స్థానంలో అదనపు ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను తీసుకుంటానని పేర్కొన్నాడు.

రాహుల్‌పై నమ్మకం
ఈ జట్టుకు పుజారా కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశాడు. దీని వెనుక అతడి బహుముఖ ప్రజ్ఞను పుజారా పరిగణనలోకి తీసుకున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు విభిన్న స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగల రాహుల్‌.. టెస్టుల్లో ఓపెనర్‌గా కూడా కీలక పాత్ర పోషించాడని అభిప్రాయపడ్డాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ను పుజారా మరో ఓపెనింగ్‌ స్థానానికి ఎంచుకున్నాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌లో మార్క్రమ్‌ చూపిస్తున్న స్థిరత్వంతో పాటు ఆస్ట్రేలియాపై గత WTC ఫైనల్‌లో చేసిన 136 పరుగుల ఇన్నింగ్స్‌ అతడి ఎంపికకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పుకొచ్చాడు.

రూట్‌, స్మిత్‌, గిల్‌కు మిడిలార్డర్‌లో చోటు
మూడో స్థానంలో ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఐదో స్థానంలో భారత టెస్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను పుజారా ఎంచుకున్నాడు.

ప్రస్తుత యాక్టివ్‌ టెస్టు బ్యాటర్లలో రూట్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉండగా, స్మిత్‌ కూడా టెస్టు క్రికెట్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. గిల్‌ కూడా ఇటీవలి కాలంలో టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో పుజారా అతడికి కీలకమైన ఐదో స్థానాన్ని ఇచ్చాడు.

పంత్‌, జడేజాకూ అవకాశం
వికెట్‌ కీపర్‌-బ్యాటర్‌గా రిషభ్‌ పంత్‌ను ఎంచుకున్న పుజారా.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజాను ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేశాడు.

జడేజా స్థానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన పుజారా.. విదేశాల్లోని పేస్‌కు అనుకూల పరిస్థితుల్లో మాత్రం అతడి స్థానంలో ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు.

ఇటీవల టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో ఉండి ఉంటే తన జట్టులో అతడికి చోటు ఇచ్చేవాడినని పుజారా వెల్లడించాడు.

పేస్‌ దళంలో బుమ్రా, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ 
పుజారా ఎంపికలో ముగ్గురు ప్రపంచస్థాయి ఫాస్ట్‌బౌలర్లకు చోటు దక్కింది. భారత స్టార్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ను పేస్‌ విభాగంలో ఎంచుకున్నాడు. స్పిన్‌ విభాగంలో ఆస్ట్రేలియా దిగ్గజం నాథన్‌ లియాన్‌కు చోటు కల్పించాడు.

స్టార్క్‌కు ఎందుకు చోటు దక్కలేదు..?
ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తాజాగా బంగ్లాదేశ్‌పై 6/12తో సంచలన ప్రదర్శన చేసి టెస్టు క్రికెట్‌లో 441 వికెట్లకు చేరుకున్నప్పటికీ, పుజారా XIలో అతడికి చోటు దక్కలేదు. స్టార్క్‌ను పక్కనపెట్టి హాజిల్‌వుడ్‌, కమిన్స్‌, బుమ్రాలను ఎంపిక చేయడం ఈ జట్టులో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

అయితే పుజారా ఎంపికలో వ్యక్తిగత ఫామ్‌ కంటే టెస్టు పరిస్థితులకు అనుగుణంగా  జట్టు సమతుల్యత ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాధారణ పిచ్‌పై ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నింగ్‌ ఆప్షన్లు, జడేజా రూపంలో ఆల్‌రౌండర్‌ ఉండేలా జట్టును రూపొందించాడు.

మొత్తంగా పుజారా వరల్డ్‌ XIలో భారత్‌ నుంచి రాహుల్‌, గిల్‌, పంత్‌, జడేజా, బుమ్రా.. ఆస్ట్రేలియా నుంచి స్మిత్‌, లియాన్‌, కమిన్స్‌, హాజిల్‌వుడ్‌ చోటు దక్కించుకున్నారు.

పుజారా వరల్డ్‌ XI: ఎయిడెన్ మార్క్రమ్, కేఎల్ రాహుల్, జో రూట్, స్టీవ్ స్మిత్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (WK), రవీంద్ర జడేజా, నాథన్ లియాన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్

చదవండి: స్టార్క్‌ సరికొత్త చరిత్ర.. రికార్డుల మోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement