
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఈ మేజర్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్నుపాము దిగువ భాగంలో నొప్పితో కమిన్స్ కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
నెలలుగా ఆటకు దూరం
జూన్- జూలైలో ఆసీస్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా కమిన్స్ మాత్రం ఫిట్‌నెస్ సమస్యలతో స్వదేశంలోనే ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ మైదానంలో దిగలేదు. అంతేకాదు.. అక్టోబరులో న్యూజిలాండ్, టీమిండియాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా కమిన్స్ దూరమయ్యాడు.
ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌కు తగినంత విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్.. తమ కెప్టెన్ విషయంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంది. అయితే, తాను యాషెస్ కూడా ఆడతానో లేదో అంటూ కమిన్స్ తాజాగా బాంబు పేల్చాడు.
ఆడతానో.. లేదో!.. వేచి చూద్దాం
విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నా. అయితే, గాయం నుంచి వంద శాతం కోలుకున్నానని చెప్పలేను. యాషెస్ నుంచి మళ్లీ మైదానంలో దిగాలనే ఆశిస్తున్నా.
అయితే, ఈ విషయంపై ఇప్పుడే స్పష్టత మాత్రం ఇవ్వలేను. యాషెస్‌లో ఆడాలనే భావిస్తున్నా. ఐదు టెస్టులు ఆడతానో లేదో ఇపుడే చెప్పడం కష్టం. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈసారి ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంరు 21- జనవరి 8 వరకు ఐదు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
యాషెస్ సిరీస్ 2025 షెడ్యూల్ ఇదే
👉తొలి టెస్టు: నవంబరు 21- 25- పెర్త్
👉రెండో టెస్టు: డిసెంబరు 4- 8- బ్రిస్బేన్
👉మూడో టెస్టు: డిసెంబరు 17- 21- అడిలైడ్
👉నాలుగో టెస్టు: డిసెంబరు 26- 30- మెల్‌బోర్న్
👉ఐదో టెస్టు: జనవరి 4- 8- సిడ్నీ.
చదవండి: IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్‌కు ధీటుగా..