
దేవ్‌దత్ పడిక్కల్ (పాత ఫొటో)
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక తొలి టెస్టులో టీమిండియా స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకంతో మెరిశాడు. ఈ కర్ణాటక బ్యాటర్ 198 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా తన కెరీర్‌లో ఏడో ఫస్ట్‌క్లాస్ సెంచరీని నమోదు చేశాడు.
కాగా భారత్-‘ఎ’ జట్టు స్వదేశంలో ఆసీస్-‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో భాగంగా మంగళవారం తొలి టెస్టు మొదలుకాగా టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్
సామ్ కొన్‌స్టాస్ (109), జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. కాంపెబెల్ కెల్లావే (88), కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. ఫలితంగా ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
భారత బౌలర్లలో హర్ష్ దూబే (Harsh Dube) మూడు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
టాపార్డర్ హిట్.. ధీటుగా భారత్ సమాధానం
ఇక ఆసీస్ భారీ స్కోరు చేయగా.. అందుకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (44), నారాయణ్ జగదీశన్ (64) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అర్ధ శతకం (73)తో మెరిశాడు.
అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ భారీ శతకం (140)తో ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిలో పెట్టగా.. శుక్రవారం నాటి ఆట సందర్భంగా పడిక్కల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పడిక్కల్ భారీ శతకం
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పడిక్కల్.. మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 150 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో శుక్రవారం భోజన విరామ సమయానికి భారత జట్టు 138 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 520 పరుగులు సాధించింది.
ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ కారీ రాచిసిల్లీ.. శ్రేయస్ అయ్యర్, దేవ్‌దత్ పడిక్కల్, తనూశ్ కొటియాన్ రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇతరులలో కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే భారత్ ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల అనధికారిక టెస్టులో ఇదే ఆఖరి రోజు. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ ముగిసిపోయే అవకాశం ఉంది.
చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు