సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు! | Bhuvneshwar Kumar Sends Direct Message To BCCI Selectors Not-Selected | Sakshi
Sakshi News home page

సెలెక్షన్‌ కమిటీపై భువ‌నేశ్వ‌ర్‌ సంచ‌ల‌న వ్యాఖ్యలు!

Jun 10 2026 1:02 PM | Updated on Jun 10 2026 1:25 PM

Bhuvneshwar Kumar Sends Direct Message To BCCI Selectors Not-Selected

టీమిండియా వెట‌రన్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌న‌ను జాతీయ జ‌ట్ట‌కు ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌ను ఎంపిక చేయాల‌ని ఎవ‌రిని అడుక్కోన‌ని, టాలెంట్‌ను గుర్తించి జ‌ట్టులోకి ఎంపిక చేస్తే ఆడుతానంటూ భువీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. టీమిండియాకు చాలాకాలం క్రిత‌మే దూర‌మైన 36 ఏళ్ల భువ‌నేశ్వ‌ర్ ఇటీవ‌లే ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 

ఆర్సీబీ త‌ర‌ఫున ఆడిన భువ‌నేశ్వ‌ర్ 28 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు. త‌ద్వారా ఆర్సీబీ వ‌రుస‌గా రెండో ఐపీఎల్ టైటిల్ సాధించ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో భువ‌నేశ్వ‌ర్‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయి. ఇటీవ‌లే ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, ఆసియా గేమ్స్‌కు సంబంధించి టీమిండియా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ భువ‌నేశ్వ‌ర్‌కు మ‌రోసారి మొండిచేయి చూపించింది. 

అయితే రెస్ట్ పేరుతో సిరాజ్‌ను ఈ టోర్నీల నుంచి త‌ప్పించ‌డంతో భువీ పేరు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. కానీ అనూహ్యంగా సిరాజ్ స్థానంలో ప్ర‌సిధ్ క్రిష్ణ‌ను ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో భువ‌నేశ్వ‌ర్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. ఈ నేప‌థ్యంలోనే బుధ‌వారం భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చాడు. 

'నేను టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. కానీ నా మ‌నసులో ఉన్న మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డం నా నైజం. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ పని తాము చేస్తున్నట్లే నా ప‌ని నేను చేస్తున్నా. బీసీసీఐ సెలెక్ట‌ర్లు కూడా వారి ప‌ని చేస్తున్నారు. ఎంపిక చేయ‌డం, చేయ‌క‌పోవ‌డం వారి బాధ్య‌త‌. 

నేను స‌రిపోతాన‌ని భావిస్తే, వాళ్లే ఎంపిక చేస్తారు. న‌న్ను ఎంపిక చేయ‌మ‌ని ఎవ‌రిని అడ‌గ‌ను. టీమిండియా త‌ర‌ఫున ఆడాల‌నే కోరిక ఇప్ప‌టికీ నాలో బ‌లంగా ఉంది. నేను మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నా. టీమిండియా త‌ర‌ఫున ఆడ‌డాన్ని ఇప్ప‌టికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.' అని ముగించాడు.

టీమిండియాకు ఎంతోకాలం ఫ్రంట్‌లైన్ బౌల‌ర్‌గా సేవ‌లందించిన భువ‌నేశ్వ‌ర్ 2022లో టీమిండియా త‌ర‌ఫున చివరిసారి ఆడాడు. నేపియ‌ర్‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్ భువీకి ఆఖ‌రి అంత‌ర్జాతీయ మ్యాచ్‌. ఆ ఏడాది జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌కప్‌లో టీమిండియా సెమీస్‌కు ప‌రిమితమైన త‌ర్వాత సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌బెట్టి, యువ బౌల‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చేందుకు అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని సెలెక్ష‌న్ క‌మిటీ మొగ్గు చూపింది. 

దీంతో భువ‌నేశ్వ‌ర్ కుమార్ క్ర‌మంగా జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. వ‌రుస గాయాలు ఇబ్బంది పెట్ట‌డంతో 2018లోనే భువీ టెస్టు కెరీర్ ముగిసిపోయింది. మ‌రి ఈ లెక్క‌న భువ‌నేశ్వ‌ర్ మ‌ళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడా  అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే. 36 ఏళ్ల వ‌య‌సులోనే త‌న బౌలింగ్‌లో ప‌దును త‌గ్గ‌ని భువ‌నేశ్వ‌ర్‌ను ఆడించాల‌నుకుంటే మాత్రం ఇదే మంచి అవ‌కాశం. 

ఎందుకంటే 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత జ‌ట్టులో చాలా మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. రోహిత్‌, కోహ్లీ, జడేజా వంటి క్రికెటర్లు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇప్ప‌టికే ఐపీఎల్ పుణ్య‌మా అని ప్రిన్స్‌యాద‌వ్‌, అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రానా వంటి బౌల‌ర్లు రేప‌టి భార‌త బౌలింగ్ భ‌విష్య‌త్తుకు ఆశాకిర‌ణంలా క‌నిపిస్తున్నారు.

చదవండి: స్టోక్స్‌పై పిడిగుద్దుల వర్షం.. ఎవరీ రగ్బీ ప్లేయర్‌?

Advertisement
 
Advertisement
Advertisement