WTC 2021-23: ఆసీస్‌పై రెండో టెస్ట్‌లో విక్టరీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా, ఇంకా రేసులో శ్రీలంక

BGT 2023 IND VS AUS 2nd Test: What India Victory Means For WTC Final Race - Sakshi

BGT 2023 IND VS AUS 2nd Test: న్యూఢిల్లీ టెస్ట్‌లో ఆసీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో సునాయాస విజయం సాధించిన అనంతరం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ బెర్తులు ఒకింత సంక్లిష్టంగా మారాయి. ఈ విజయంతో భారత్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ను 61.67 నుంచి 64.06కు పెంచుకుని, డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్తు కోసం ఆసీస్‌-శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. తాజా ఓటమితో ఆసీస్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 70.83 నుంచి 66.67 శాతానికి పడిపోవడంతో శ్రీలంక (53.33) ఆశలు సజీవంగా మారాయి. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో ఆసీస్‌ ముందువరుసలో ఉన్నప్పటికీ.. ఆ జట్టుకు ఇప్పటివరకు అధికారికంగా ఫైనల్‌ బెర్త్‌ ఖరారు కాలేదు. ఒకవేళ BGT-2023లో కంగారూలు క్లీన్‌ స్వీప్‌ (0-4) అయ్యి, ఆ తర్వాత జరిగే సిరీస్‌లో శ్రీలంక.. న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో చిత్తు చేస్తే, ఆసీస్‌ ఇంటిబాట పడుతుంది. అప్పుడు భారత్‌తో పాటు శ్రీలంక ఫైనల్‌కు చేరుతుంది. అయితే ఇది అంతా ఈజీగా జరిగే పనికాదు. ఒకవేళ భారత్‌.. ఆసీస్‌ను ఊడ్చేసినా, న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం శ్రీలంకకు అంత సులువు కాదు. కివీస్‌-శ్రీలంక సిరీస్‌ మార్చి 9 నుంచి మొదలవుతుంది. 

ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించడంతో 4 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జడేజా (3/68, 7/42), అశ్విన్‌ (3/57, 3/59) పట్టపగ్గాలు లేకుండా విజృంభించి ఆసీస్‌ వెన్నువిరిచారు. ముఖ్యంగా జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విశ్వరూపం ప్రదర్శించి, ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన జడ్డూ.. టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు. జడేజా ధాటికి ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 115 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా రోహిత్‌ (31), కేఎల్‌ రాహుల్‌ (1), కోహ్లి (20), శ్రేయస్‌ అయ్యర్‌ (12) వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top