బెంగళూరుకు తొలి ఓటమి | Bengalurus first defeat in the Indian Super League | Sakshi
Sakshi News home page

బెంగళూరుకు తొలి ఓటమి

Nov 3 2024 4:09 AM | Updated on Nov 3 2024 4:09 AM

Bengalurus first defeat in the Indian Super League

3–0తో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ గెలుపు 

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌

మార్గావ్‌: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌కు భంగపాటు ఎదురైంది. తాజా సీజన్‌లో ఓటమి లేకుండా సాగుతున్న బెంగళూరు జట్టు... శనివారం జరిగిన పోరులో 0–3తో గోవా ఫుట్‌బాల్‌ క్లబ్‌ చేతిలో ఓడింది. సీజన్‌లో రెండో విజయం నమోదు చేసుకున్న గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (63వ నిమిషంలో), బ్రిసన్‌ ఫెర్నాండెస్‌ (72వ ని.లో), డెజాన్‌ డ్రాజిక్‌ (90+3వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. 

భారత జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ మనోలో మార్క్వెజ్‌ శిక్షణలో బరిలోకి దిగిన గోవా జట్టు... మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత సమయంలో గోవా 19 షాట్లు ఆడగా... బెంగళూరు బుల్స్‌ 8 షాట్లు ఆడింది. లక్ష్యంపైకి ఐదు షాట్లు సంధించిన గోవా... అందులో మూడింటిని గోల్‌ పోస్ట్‌లోకి పంపింది. 

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 5 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లు నమోదు చేసుకున్న గోవా 9 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒడిషా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో... ముంబై సిటీ జట్టుతో కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తలపడతాయి.   

Advertisement
 
Advertisement
Advertisement