
47–26తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై జయభేరి
ప్రొ కబడ్డీ లీగ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో ప్లేఆఫ్స్ రేసులో పడేందుకు బెంగళూరు బుల్స్ జోరు పెంచుతోంది. ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో టాప్–5లో నిలిచింది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై ఘనవిజయం సాధించింది. బుల్స్ 47–26తో రెండుసార్లు చాంపియన్ అయిన జైపూర్‌ను చిత్తు చేసింది. బెంగళూరు ఆల్‌రౌండర్ అలీరెజా మిర్జాయిన్ ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.
22 సార్లు కూతకెళ్లిన అతను 12 పాయింట్లను తెచ్చిపెట్టాడు. కెప్టెన్, డిఫెండర్ యోగేశ్ (8) జైపూర్ రెయిడర్లను వణికించాడు. రెయిడర్లను 8 సార్లు విజయవంతంగా టాకిల్ చేశాడు. అతనితో పాటు డిఫెన్స్‌లో దీపక్ శంకర్ (5), సంజయ్ (3) రాణించారు.
రెయిడర్లలో ఆశిష్ మాలిక్ (5), ఆకాశ్ షిండే (4)లు అదరగొట్టారు. పింక్‌పాంథర్స్ జట్టులో రెయిడర్లు అలీ సమది (9), వినయ్ (6) ఆకట్టుకున్నారు. కానీ సహచరుల నుంచి మద్దతు లేకపోవడంతో టాకిల్‌లో పదేపదే వెనుకబడింది. ఈ సీజన్‌లో జైపూర్ జట్టుకు ఇది ఏడో పరాజయం!
ప్లేఆఫ్స్ చేరిన పుణేరి పల్టన్
మాజీ చాంపియన్ (2023) పుణేరి పల్టన్ 12వ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి జట్టు 36–23తో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. రెయిడర్ పంకజ్ మోహితే (9), కెప్టెన్ అస్లామ్ ఇనామ్‌దార్ (7), ఆల్‌రౌండర్ గుర్‌దీప్ (5), డిఫెండర్ విశాల్ భరద్వాజ్ (4) క్రమం తప్పకుండా పాయింట్లు చేసి పుణేరి పల్టన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
తలైవాస్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ (6), అరుళ్ (4), నితీశ్ కుమార్ (3) రాణించారు. లీగ్‌లో 14 పోటీలాడిన పుణేరి 11 మ్యాచ్‌ల్లో గెలిచి కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఓడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన దబంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ జట్లు నేడు జరిగే తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. మరో పోరులో బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ పోటీపడుతుంది.