జితేశ్‌ జితాదియా | Bengaluru beat Lucknow by 6 wickets | Sakshi
Sakshi News home page

జితేశ్‌ జితాదియా

May 28 2025 1:26 AM | Updated on May 28 2025 7:46 AM

Bengaluru beat Lucknow by 6 wickets

33 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో జితేశ్‌ శర్మ 85 నాటౌట్‌  

6 వికెట్లతో లక్నోపై బెంగళూరు జయభేరి 

క్వాలిఫయర్‌–1కు అర్హత  

రిషభ్‌ పంత్‌ సెంచరీ వృథా 

లక్నో: సొంతగడ్డపై విజయగర్వంతో సీజన్‌ను ముగించే భారీ స్కోరునే లక్నో చేసింది... ఛేదనలో సాల్ట్, లివింగ్‌స్టోన్, కోహ్లిలాంటి విలువైన వికెట్లను తీసింది. 52 బంతుల్లో 105 పరుగుల సమీకరణం బెంగళూరుకు క్లిష్టంగా అనిపించింది... అయితే కెప్టెన్ జితేశ్‌... మయాంక్‌తో కలిసి చేసిన బ్యాటింగ్‌ మ్యాజిక్‌ మ్యాచ్‌నే మార్చేసింది. ఇంకో 8 బంతులు మిగిలుండగానే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. 

కెప్టెన్ రిషభ్‌ పంత్‌ (61 బంతుల్లో 118 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) సీజన్‌లో తొలి సెంచరీతో కదం తొక్కగా, మిచెల్‌ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జితేశ్‌ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) చెలరేగారు. 

చితగ్గొట్టిన పంత్‌  
మార్ష్ తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బ్రిట్‌జ్కీ (14) మూడో ఓవర్లో నిష్క్రమించాడు. తర్వాత రిషభ్‌ పంత్‌ రావడంతో లక్నో ప్రతీ ఓవర్లోనూ పండగ చేసుకుంది. యశ్‌ దయాళ్‌ వేసిన నాలుగో ఓవర్లో ఒక సిక్స్, రెండు బౌండరీలు బాదడం ద్వారా పంత్‌ ప్రతాపం మొదలైంది. పవర్‌ప్లే తర్వాత ఓ వైపు మార్ష్, ఇంకోవైపు రిషభ్‌ ధనాధన్‌ షోతో ఓవర్‌కు సగటున పది పరుగుల రన్‌రేట్‌ నమోదైంది. దీంతో 9.5 ఓవర్లో జెయింట్స్‌ 100 స్కోరును చేరుకుంది.

ముందుగా పంత్‌ 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో సిక్సర్‌తో మార్ష్ 31 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. ఆ ఓవర్లో రిషభ్‌ కూడా ఫోర్, సిక్స్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన  మార్ష్ ను భువనేశ్వర్‌ అవుట్‌ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 152 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి తెరపడింది. అతని మరుసటి ఓవర్లో బౌండరీతో పంత్‌ 54 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకోవడం, జట్టు 200మార్క్‌ దాటడం జరిగిపోయాయి.  

మెరుపు భాగస్వామ్యం... 
సాల్ట్, కోహ్లిలు పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు బౌండరీలతో స్కోరుబోర్డును పరుగు పెట్టించారు. 4 ఓవర్లలోనే స్కోరు 50కి చేరింది. కానీ పవర్‌ప్లే ఆఖరి ఓవర్లోనే సాల్ట్‌ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కోహ్లికి జతయిన రజత్‌ పటిదార్‌ (14) ఫోర్, సిక్సర్‌ బాదాడు. కానీ రూర్కే ఒకే ఓవర్లో అతన్ని, లివింగ్‌స్టోన్‌ (0)ను అవుట్‌ చేసి బెంగళూరును కష్టాల్లో పడేశాడు. 

కోహ్లి తన మార్క్‌ షాట్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్‌ లక్ష్యాన్ని కరిగించేంత వేగంగా దూసుకెళ్లింది. 9.1 ఓవర్లోనే ఆర్సీబీ స్కోరు వందను దాటేసింది. కోహ్లి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ధాటిని కొనసాగించే ప్రయత్నంలో కొట్టిన షాట్‌ మిడాఫ్‌లో బదోని చేతికి చిక్కడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 11.2 ఓవర్లలో 123/4. కాగా గెలుపు సమీకరణం 52 బంతుల్లో 105 చాలా కష్టమైంది.

మయాంక్, కెప్టెన్ జితేశ్‌ శర్మల మెరుపులకు తోడు... లక్నో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్, సులువైన రనౌట్‌పట్ల రూర్కే అశ్రద్ధ వెరసి... పరుగులు, బౌండరీలు అలవోకగా రావడంతో చూస్తుండగానే లక్ష్యం దిగొచ్చింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు మయాంక్, జితేశ్‌లు కేవలం 44 బంతుల్లోనే 107 పరుగులు జోడించడం విశేషం!  

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 67; బ్రిట్‌జ్కీ (బి) తుషార 14; పంత్‌ నాటౌట్‌ 118; పూరన్‌ (సి) యశ్‌ దయాళ్‌ (బి) షెఫర్డ్‌ 13; సమద్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227. వికెట్ల పతనం: 1–25, 2–177, 3–226. బౌలింగ్‌: తుషార 4–0–26–1, కృనాల్‌ పాండ్యా 2–0–14–0, యశ్‌ దయాళ్‌ 3–0–44–0, భువనేశ్వర్‌ 4–0–46–1, సుయశ్‌ 3–0–39–0, షెఫర్డ్‌ 4–0–51–1. రాయల్‌ చాలెంజర్స్‌ 

బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) దిగ్వేశ్‌ (బి) ఆకాశ్‌ 30; కోహ్లి (సి) బదోని (బి) అవేశ్‌ఖాన్‌ 54; పటిదార్‌ (సి) సమద్‌ (బి) రూర్కే 14; లివింగ్‌స్టోన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రూర్కే 0; మయాంక్‌ నాటౌట్‌ 41; జితేశ్‌ నాటౌట్‌ 85; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1–61, 2–90, 3–90, 4–123. బౌలింగ్‌: ఆకాశ్‌ 4–0–40–1, విల్‌ రూర్కే 4–0–74–2, దిగ్వేశ్‌ రాఠి 4–0–36–0, షాబాజ్‌ 3–0–39–0, అవేశ్‌ఖాన్‌ 3–0–32–1, బదోని 0.4–0–9–0.  

ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’
క్వాలిఫయర్‌–1 (మే 29)
పంజాబ్‌ X బెంగళూరు
వేదిక: ముల్లాన్‌పూర్‌ , రాత్రి 7: 30 గంటల నుంచి

ఎలిమినేటర్‌ (మే 30)
గుజరాత్‌ X ముంబై
వేదిక: ముల్లాన్‌పూర్‌ , రాత్రి 7: 30 గంటల నుంచి 
స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement