
బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ మీర్ బెలాయెట్ హుస్సేన్(70) కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1970లలో బంగ్లాదేశ్‌కు టెస్ట్ హోదా లేకపోవడం కారణంగా.. బెలాయిట్ జాతీయ జట్టు తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన 1979 ఐసీసీ ట్రోఫీలో ఆయన పాల్గొన్నారు. కాగా దేశవాళీ క్రికెట్‌లో మాత్రం ఆయనకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అబహాని, కలబాగన్, రూపాలి బ్యాంక్, అగ్రాని బ్యాంక్, ధన్మొండి క్లబ్ జట్లకు బెలాయిట్ ప్రాతినిథ్యం వహించాడు.
ఇక రిటైర్ అయిన తర్వాత హుస్సేన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 81 లిస్ట్ A మ్యాచ్‌లు, ఓ టీ20 మ్యాచ్‌కు మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రాంతీయ అభివృద్ధి మేనేజర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన మృతి పట్ల పలువురు బంగ్లాక్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.