2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు | Australias Famous Cricket Stadium Gabba Is Going To Disappear After 2032 Olympics, Check Interesting Facts Inside | Sakshi
Sakshi News home page

2032 తర్వాత ‘గాబా’ కనుమరుగు

Published Wed, Mar 26 2025 4:00 AM | Last Updated on Wed, Mar 26 2025 9:33 AM

Australias famous cricket stadium Gabba is going to disappear

బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌ తర్వాత క్రికెట్‌ స్టేడియం కూల్చివేత 

ఒలింపిక్స్‌ స్టేడియంలో తదుపరి క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ

బ్రిస్బేన్‌: ఆ్రస్టేలియాలోని ప్రఖ్యాత క్రికెట్‌ స్టేడియం ‘గాబా’ కనుమరుగు కానుంది. సుదీర్ఘకాలంగా ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానాన్ని 2032 ఒలింపిక్స్‌ తర్వాత కూల్చివేయనున్నారు. 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెలిస్‌ ఆతిథ్యమిస్తుండగా... మరో నాలుగేళ్ల తర్వాత బ్రిస్బేన్‌ వేదికగా విశ్వక్రీడలు జరగనున్నాయి. దాని కోసం ఆ్రస్టేలియా ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా... క్వీన్స్‌లాండ్‌ ప్రభుత్వం వేదికలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఒలింపిక్స్‌ కోసం విక్టోరియా పార్క్‌లో 63 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో కూడిన నూతన అధునాతన స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇందులోనే ఒలింపిక్స్‌ ఆరంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. విశ్వక్రీడలు ముగిసిన అనంతరం ‘గాబా’ మైదానాన్ని పూర్తిగా పడగొట్టి ఒలింపిక్స్‌ కోసం నిర్మించిన కొత్త స్టేడియంలోనే క్రికెట్‌ మ్యాచ్‌లు జరపనున్నారు. 

ఒకవేళ 2032 ఒలింపిక్స్‌ క్రీడల్లో క్రికెట్‌ మెడల్‌ ఈవెంట్‌గా కొనసాగితే క్రికెట్‌ ఈవెంట్‌ స్వర్ణ పతక పోరుకు మాత్రం పాత ‘గాబా’ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. ‘గాబా స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నో మరపురాని మ్యాచ్‌లు జరిగాయి. ఆటగాళ్లకు, అభిమానులకు ఈ మైదానంతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.

అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మైదానాన్ని కూల్చివేయనున్నారు. దీని స్థానంలో క్వీన్స్‌ల్యాండ్‌లో మరో కొత్త స్టేడియం సిద్ధమవుతుంది. అందులో ఐసీసీ ఈవెంట్‌లు, యాషెస్‌ సిరీస్, ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ వంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు యధావిధిగా జరుగుతాయి’ అని క్వీన్స్‌ల్యాండ్‌ క్రికెట్‌ సీఈవో టెర్రీ స్వెన్సన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

» 1931 నుంచి టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ‘గాబా’ స్టేడియంలో ఇప్పటి వరకు 67 పురుషుల టెస్టు మ్యాచ్‌లు, 2 మహిళల టెస్టులు జరిగాయి.  
»పేస్‌కు పెట్టింది పేరైన ‘గాబా’ పిచ్‌పై ఆ్రస్టేలియా జట్టు 1988 నుంచి 2021 వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా ఓడలేదు. 2020–21 పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది.  
»2032 ఒలింపిక్స్‌ ప్రణాళికల్లో భాగంగా ‘గాబా’ మైదానాన్ని ఆధునీకికరించాలని తొలుత భావించారు. అయితే అధిక వ్యయం కారణంతో ఆ ప్రణాళికను పక్కన పెట్టి పార్క్‌ల్యాండ్‌ ఇన్నర్‌ సిటీలో కొత్త స్టేడియం నిర్మాణం చేపడుతున్నారు.  
»ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న సమయంలో ‘గాబా’ మైదానాన్ని మరింత మెరుగు పరచాలని భావించినా... ఇప్పటికి నాలుగేళ్లు గడిచినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  
»విశ్వక్రీడలకు మరో ఏడేళ్ల సమయమే ఉండటంతో కొత్త స్టేడియం నిర్మాణానికే మొగ్గుచూపారు.  
»ఇటీవల ఐఓసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన క్రిస్టీ కొవెంట్రీ ప్రణాళికల విషయంలో పక్కాగా ఉండటంతో... ఆ్రస్టేలియా ప్రభుత్వం వేదికల నిర్మాణాన్ని వేగవంతం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement