టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఈ నెలఖారులో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో ఆసీస్ ఆతిథ్య పాక్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు.
అయితే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీరితో పాటు టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్ కూడా పాక్‌స్తాన్‌కు వెళ్లడం లేదు. వీరంతా నేరుగా శ్రీలంకలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరనున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు హాజిల్‌వుడ్, డేవిడ్ గాయపడిన సంగతి తెలిసిందే.
హాజిల్‌వుడ్ గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకోగా.. డేవిడ్ తొడ కండరాల గాయంతో బిగ్ బాష్ లీగ్ మధ్యలో వైదొలగాడు. అయితే వీరిద్దరూ వరల్డ్‌కప్ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి.
జట్టులోకి యువ ఆటగాళ్లు..
ఇక బిగ్ బాష్ లీగ్‌లో అదరగొట్టిన పేసర్ మహ్లి బియర్డ్‌మాన్, ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌కు తొలిసారి ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కింది. 20 ఏళ్ల బియర్డ్‌మాన్ పెర్త్ స్కార్చర్స్ తరఫున అద్భుతంగా రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అదేవిధంగా జాక్ ఎడ్వర్డ్స్ అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
దీంతో వీరిద్దరికి జాతీయ సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్-2026 వేలంలో ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇక పాక్-ఆసీస్ టీ20 సిరీస్ జనవరి 29 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు టి20 మ్యాచ్‌లు లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరగనున్నాయి.
పాక్‌తో టీ20లకు ఆసీస్ జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లి బియర్డ్‌మాన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాథ్యూ కునెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
టీ20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
చదవండి: న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి.. శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం


