PC: BCCI/X
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆసీస్ సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 15 ఏళ్లుగా ఆసీస్ టెస్టు జట్టులో సీనియర్ ప్లేయర్‌గా కొనసాగుతున్న స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్‌పై సెలక్టర్లు వేటు వేశారు.
2011లో టెస్టు అరంగేట్రం చేసిన తర్వాత అతడు జట్టుకు దూరం కావడం ఇదే తొలిసారి. కాగా లియోన్ స్ధానంలో 29 ఏళ్ల అన్‌క్యాప్డ్ ఆఫ్ స్పిన్నర్ కోరీ రోచిసియోలికి సెలెక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో రోచిసియోలికి జాతీయ జట్టులోకి చోటు దక్కింది.
లియోన్‌పై వేటు ఎందుకంటే?
కాగా లియోన్ టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. లియోన్ 145 టెస్టుల్లో 577 వికెట్లు పడగొట్టి షేన్ వార్న్ (708) తర్వాత ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల అతడి ఫామ్ జట్టులో చోటు కోల్పోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
2023 నుంచి 2025 వరకు 109 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో ఉన్న లియోన్.. 2026లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది ఆడిన నాలుగు టెస్టుల్లో 41.20 సగటుతో కేవలం 10 వికెట్లు మాత్రమే తీశాడు. ఒక వికెట్ తీయడానికి సగటున 94 బంతులు తీసుకోవడం గమనార్హం. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ విఫలమవడంతో పాటు, షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిపై సెలక్టర్లు వేటు వేశారు.
అయితే కివీస్ సిరీస్ నుంచి లియోన్‌ను తప్పించినప్పటికీ అతడి కెరీర్ ఇంకా ముగిసిపోలేదని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. తొందరపడి రిటైర్మెంట్ ప్రకటించవద్దని అతడికి సూచించినట్లు బెయిలీ తెలిపాడు. కాగా వచ్చే ఏడాది ఆరంభంలో ఆసీస్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఉపఖండ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నుందన లియోన్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
కాగా పేలవ ఫామ్ కారణంగా మార్నస్ లబుషేన్‌తో పాటు కూపర్ కొన్నోలీ, బ్యూ వెబ్‌స్టర్‌లను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో క్వీన్స్‌లాండ్ బ్యాటర్ జాక్ క్లేటన్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జాక్ క్లేటన్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మైఖేల్ నేసర్, మాట్ రెన్షా, కోరీ రోచిసియోలి, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.
సిరీస్ షెడ్యూల్:
తొలి టెస్టు: డిసెంబర్ 9 – 13 (పెర్త్)
రెండో టెస్టు: డిసెంబర్ 17 – 21 (అడిలైడ్)
మూడో టెస్టు (బాక్సింగ్ డే): డిసెంబర్ 26 – 30 (మెల్‌బోర్న్)
నాలుగో టెస్టు: జనవరి 4 – 8, 2027 (సిడ్నీ)
చదవండి: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. సూర్యకుమార్ పోస్ట్ వైరల్!


