PC: BCCI/X
ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు. కివీస్ సెలక్టర్లు ఈ జట్టులో ఆస్ట్రేలియా పిచ్‌లకు అనుగుణంగా ఏడుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. వర్క్‌లోడ్‌లో భాగంగా భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమైన యువ పేసర్ విల్ ఓ'రూర్క్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
విల్ ఓ'రూర్క్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మాట్ ఫిషర్, మైఖేల్ రే కూడా టెస్టు జట్టులోకి పునరాగమనం చేశారు. మాట్ ఫిషర్ కివీస్ తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే రిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండటంతో సెలెక్టర్లు అతడికి మరోసారి అవకాశమిచ్చారు.
మైఖేల్ రే కూడా దేశవాళీ సీజన్‌లో అద్భుతంగా రాణించడంతో ఏడాది తర్వాత తిరిగి మళ్లీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వీరితో పాటు మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ పేస్ విభాగంలో ఉన్నారు. రెగ్యులర్ స్పిన్నర్ ఒక్కరూ కూడా ఈ జట్టులో లేకపోవడం గమనార్హం.
మరోవైపు గాయాల కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్, పేసర్ బ్లెయిర్ టిక్నర్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ప్రస్తుత జట్టులో చోటు దక్కలేదు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నారు. వారిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో జట్టుతో కలిసే అవకాశం ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కాగా ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
ఆసీస్‌తో టెస్టులకు కివీస్ జట్టు
టామ్ లాథమ్(కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్
చదవండి: IND vs NZ: రిషభ్ పంత్ ప్రపంచ రికార్డు


