CWC 2023 AUS Vs NZ: అతి భారీ సిక్సర్‌ నమోదు

AUS VS NZ: Glenn Maxwell Smashed Longest Six Of 2023 World Cup - Sakshi

2023 వన్డే ప్రపంచకప్‌లోకెళ్లా అత్యంత భారీ సిక్సర్‌ ఇవాళ (అక్టోబర్‌ 28) జరుగుతున్న ఆసీస్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో నమోదైంది. ఆసీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్సర్‌ బాదాడు. మ్యాక్స్‌వెల్‌ కొట్టిన బంతి స్టేడియం రూఫ్‌పై పడింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అతి భారీ సిక్సర్‌. మ్యాక్స్‌వెల్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ పేరిట ఉండేది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌ 101 మీటర్ల సిక్సర్‌ బాదాడు. అయ్యర్‌కు ముందు డేవిడ్‌ వార్నర్‌ 98 మీటర్ల సిక్సర్‌, డారిల్‌ మిచెల్‌ 98 మీట్లర సిక్సర్‌, డేవిడ్‌ మిల్లర్‌ 95 మీటర్ల సిక్సర్లు బాదారు. 

కాగా, కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగి 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతనికి ముందు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (65 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్‌ హెడ్‌ (67 బంతుల్లో 109; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌లతో శివాలెత్తడంతో ఆసీస్‌ 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జోష్‌ ఇంగ్లిస్‌ (28 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్‌), పాట్‌ కమిన్స్‌ (14 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. 

కివీస్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌, బౌల్ట్‌ చెరి 3 వికెట్లు, సాంట్నర్‌ 2, మ్యాట్‌ హెన్రీ, నీషమ్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. ఓపెనర్లు కాన్వే (28), విల్‌ యంగ్‌ (32) ఔట్‌ కాగా.. రచిన్‌ రవీంద్ర (18), డారిల్‌ మిచెల్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ కోల్పోయిన 2 వికెట్లు హాజిల్‌వుడ్‌కు దక్కాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top