
ఆస్ట్రేలియా పర్యటనలో భారత అండర్-19 జట్టు (Team India) తొలిసారి బ్యాటింగ్‌లో తడబాటుకు లోనైంది. మెక్‌కే వేదికగా ఇవాళ (అక్టోబర్ 7) మొదలైన రెండో టెస్ట్‌లో టాపార్డర్ విఫలం కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత స్కోర్ 7 వికెట్ల నష్టానికి 144 పరుగులుగా ఉంది.
వన్‌డౌన్‌లో వచ్చిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్) తన సహజ శైలిలో ధాటిగా ఆడినప్పటికీ, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా (11) నిరాశపరిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపర కొనసాగించాడు.
వేదాంత్ త్రివేది (25) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. రాహుల్ కుమార్ (9), వికెట్‌కీపర్ హర్వంశ్ పంగాలియా (1) సింగిల్ డిజిట్ స్కోర్‌కే టపా కట్టేశారు. ఖిలన్ పటేల్ (26) కాసేపు పోరాడినప్పటికీ, ఆట ముగిసే సమయానికి కొద్ది ముందుగా ఔటయ్యాడు.
హెనిల్ పటేల్ (22 నాటౌట్), దీపేశ్ దేవేంద్రన్ (6 నాటౌట్) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్, విల్ బైరోమ్ టీమిండియా టాపార్డర్‌ను ఇబ్బంది పెట్టారు. కేసీ 2, బైరోమ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఛార్లెస్ లచ్‌మండ్, జూలియన్‌కు తలో వికెట్ దక్కింది. టాపార్డర్ తడబడినా టీమిండియాకు ఇప్పటికే 9 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలింది. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) కలిసికట్టుగా ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.
చదవండి: కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ కొడుకు.. కరుణ్ నాయర్ రీఎంట్రీ