
త్వరలో జరుగనున్న వినూ మన్కడ్ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) కెప్టెన్‌గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్ కృష్ణ, శిఖర్ షెట్టి, మొహిసిన్ ఖాన్ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.
కరుణ్ నాయర్ రీఎంట్రీ
ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విఫలమై, విండీస్ పర్యటనకు ఎంపిక కాని కరుణ్ నాయర్ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్‌ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు.
గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్ ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌తో కరుణ్ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.
2025/26 రంజీ సీజన్ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.
కెప్టెన్‌గా అన్వయ్ ద్రవిడ్
50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే వినూ మన్కడ్ ట్రోఫీ అక్టోబర్ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్‌లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అన్వయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ఎస్ మణికాంత్ నియమితుడయ్యాడు.
వినూ మన్కడ్ ట్రోఫీ 2025 కోసం కర్ణాటక జట్టు: అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్
అన్వయ్ ద్రవిడ్‌కు అవార్డు
గత ఎడిషన్ అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీలో (రెడ్‌బాల్) సత్తా చాటిన అన్వయ్ ద్రవిడ్‌ను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్ 6 మ్యాచ్‌ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
కాగా, రాహుల్ ద్రవిడ్ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్ సీనియర్ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్.
చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్ చిన్న కుమారుడి జోరు..