
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారులు ఇద్దరూ తండ్రి బాటలోనే నడుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ ద్రవిడ్, చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid) కర్ణాటక క్రికెట్ జట్టు తరఫున సత్తా చాటుతున్నారు.
సమిత్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కాగా.. అన్వయ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కాగా అండర్-16 క్రికెట్‌లో సత్తా చాటుతున్న అన్వయ్‌కు తాజాగా అవార్డు లభించింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అతడిని సత్కరించింది.
అత్యధిక పరుగుల వీరుడిగా మయాంక్
తమ రాష్ట్రం తరఫున సత్తా చాటుతున్న క్రికెటర్లకు కేఎస్‌సీఏ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం పురస్కారాలు అందజేసే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా టీమిండియా వెటరన్ ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను సత్కరించింది.
గతేడాది దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగార్వల్ సగటు 93తో 651 పరుగులు చేసి.. లిస్ట్-ఎ క్రికెట్‌లో కర్ణాటక తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్‌కోచ్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ వరుసగా రెండో ఏడాది సత్తా చాటి అవార్డు అందుకున్నాడు.
రెండు సెంచరీలు.. 459 పరుగులు..
అండర్-19 విజయ్ మర్చంట్ ట్రోఫీ (రెడ్‌బాల్)లో భాగంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన అన్వయ్.. 91.80 సగటుతో 459 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా.. 46 బౌండరీలు కూడా అన్వయ్ ఖాతాలో చేరాయి. తద్వారా కర్ణాటక తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచి అన్వయ్ అవార్డు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో తండ్రి తగ్గ తనయుడు అంటూ అన్వయ్‌ను ద్రవిడ్ అభిమానులు కొనియాడుతున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తూ.. టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
వీరికి కూడా అవార్డులు
ఇదిలా ఉంటే.. మిగతా వారిలో ఎడమచేతి వాటం బ్యాటర్ ఆర్. స్మరణ్ రంజీ ట్రోఫీలో రెండు శతకాల సాయంతో 516 పరుగులు చేసి.. టాప్ రన్ స్కోరర్‌గా అవార్డు అందుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో వాసుకీ కౌశిక్ గతేడాది 23 వికెట్లు పడగొట్టి పురస్కారం అందుకున్నాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవాకు ఆడబోతుండటం గమనార్హం.
అదే విధంగా.. లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ శ్రీజిత్ కూడా సత్తా చాటి పురస్కారాలు అందుకున్నారు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గోపాల్ 14 వికెట్లు తీయగా.. శ్రీజిత్ 213 పరుగులు సాధించాడు.
ఇక మహిళా క్రికెటర్లకు కూడా KSCA ఈ సందర్భంగా అవార్డులు అందజేసింది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన నికీ ప్రసాద్, మిథిలా వినోద్‌లను సత్కరించింది. అదే విధంగా పర్ఫామెన్స్ అనలిస్ట్ మాలా రంగస్వామికి కూడా అవార్డు అందజేసింది.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్