అఫ్గాన్ జట్టు (PC: ACC Media X)
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2026 వన్డే టోర్నమెంట్లో అఫ్గానిస్తాన్ యువ జట్టు సంచలన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను ఏకంగా 113 పరుగుల తేడాతో మట్టికరిపించింది. అల్ ఎమిరట్ వేదికగా గురువారం మొదలైన ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో మలేషియాపై శ్రీలంక గెలిచింది.
టాపార్డర్ కుదేలైనా..
ఇక రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్- అఫ్గానిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్‌లో షా ఫైసల్ రహీమీ అద్భుత అర్ధ శతకం (83)తో జట్టును ఆదుకున్నాడు.
231 పరుగులు
అతడికి తోడుగా తాహిర్ సర్వారి (37) కూడా రాణించాడు. ఈ క్రమంలో 49 ఓవర్లలో అఫ్గాన్ అండర్-19 జట్టు 231 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బౌలర్లలో తాఫుల్ అలామ్ తమీమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రుబే ఇస్లాం రిజాన్, షేక్ అతీకర్ రహ్మాన్, అల్ రఫీ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
118 పరుగులకే కుప్పకూలిన బంగ్లా
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ అఫ్గాన్ బౌలర్ల విజృంభణ కారణంగా 25.5 ఓవర్లలో కేవలం 118 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ ఎస్‌కే జారిఫ్ సియామ్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వారిలో రాబిఉల్ హసన్ అనీక్ 33, రుబే ఇస్లాం రిజాన్ 21 పరుగులు చేయగలిగారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
ముగ్గురు మొనగాళ్లు
అఫ్గానిస్తాన్ యువ బౌలర్లలో నూర్ అలీ నియాజి (Noor Ali Niazi), ఆమిర్ హంజా, సమీ ముబారేజ్ తలా మూడు వికెట్లు కూల్చగా.. కెప్టెన్ సొహైల్ అలీ ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా ఆసియా పురుషుల అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ-2026లో గ్రూప్-ఎ నుంచి భారత్, నేపాల్, పాకిస్తాన్, యూఏఈ తలపడుతుండగా.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా పోటీలో ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, అఫ్గాన్ చెరో విజయంతో పాయింట్ల పట్టికలో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచాయి.
ఇవీ చదవండి: ‘అతడిని డ్రెసింగ్‌రూమ్‌లోనే కూర్చోబెడతా.. ఇంటికి కూడా వెళ్లనివ్వను’
రేపు రెండో వన్డే.. సిరీస్ మొత్తానికి దూరమైన కివీస్ స్టార్


