
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అభిషేక్ ఇటీవలే ముగిసిన ఆసియాకప్‌లో దుమ్ములేపాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 200 స్ట్రైక్ రేట్‌తో 314 పరుగులు చేశాడు.
ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచిన అభిషేక్ ఇన్నింగ్స్‌లలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఖండాంతర టోర్నీలో దాయాది పాకిస్తాన్‌కు అభిషేక్ చుక్కలు చూపించాడు. ఒక ఫైనల్లో తప్ప మిగితా లీగ్, సూపర్-8లలో పాక్ బౌలర్లను శర్మ ఉతికారేశాడు.
సూపర్-4 మ్యాచ్‌లో అయితే అభిషేక్ బ్యాటింగ్ జోరుకు పాక్ స్పీడ్‌స్టార్ హ్యారిస్ రౌఫ్ తన సహనాన్ని కోల్పోయాడు. అభిషేక్‌తో వాగ్వాదానికి దిగాడు. రౌఫ్‌కు అభిషేక్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ పంజాబ్ క్రికెటర్ పాక్‌పై మూడు మ్యాచ్‌లు ఆడి 110 పరుగులు చేశాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా అభిషేక్ శర్మపై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా ఓ ఛాలెంజ్ విసిరాడు. అభిషేక్ తన బౌలింగ్‌ను ఎదుర్కొలేడని.. కేవలం మూడు బంతుల్లో ఔట్ చేయగలని అతడు చెప్పుకొచ్చాడు. ఇహ్సానుల్లా పాక్ తరపున కేవలం 4 టీ20ల్లో మాత్రమే ఆడాడు.
అభిషేక్‌తో కలిసి అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. "నేను భారత్‌తో ఆడితే అభిషేక్ నా బౌలింగ్‌ను ఎదుర్కోలేడు. అతడిని ఔట్ చేయడానికి నాకు కేవలం మూడు బంతులు చాలు అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. ఈ పాక్ ఆటగాడికి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.
ఆసియాకప్ మ్యాచ్‌లు చూడలేదా? అయితే మీ బౌలర్లను అభిషేక్ గురించి అడుగు అని పోస్ట్‌లు పెడుతున్నారు. అభిషేక్ తిరిగి భారత జట్టు తరపున ఈ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు.
చదవండి: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు!.. నాకు ముందే తెలుసు: గిల్