అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు.
ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.
ఈ నేపథ్యంలో వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్నాడు.
అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్‌లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.
ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్‌కు కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.
నిజానికి జైసూ అఫ్గనిస్తాన్‌తో చండీగఢ్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్‌కు బదులు ఇషాన్ కిషన్‌నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.
ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్‌కే పరిమితమయ్యే పరిస్థితి.


