ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్‌.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు!

1975 On This Day: West Indies Won Inaugural ODI World Cup Defeating Australia - Sakshi

ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్‌ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్‌ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్‌కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! 

మరి తొలిసారిగా సరిగ్గా ఇదే రోజు విండీస్‌ జట్టు క్రీడా ప్రపంచం చేత చాంపియన్‌గా నీరాజనాలు అందుకుంది. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాను ఓడించి విశ్వ విజేతగా అవతరించింది. మొట్టమొదటి ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడి తమ దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేలా చేసింది.


ట్రోఫీతో విండీస్‌ కెప్టెన్‌ లాయిడ్‌ (PC: ICC)

టోర్నీ సాగింది ఇలా!
అది 1975.. పరిమిత ఓవర్ల ప్రపంచకప్‌ రేసులో ఇంగ్లండ్‌, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, ఈస్ట్‌ ఆఫ్రికా, న్యూజిలాండ్‌ తదితర 8 జట్లు పోటీ పడ్డాయి. జూన్‌ 7న ఇంగ్లండ్‌- ఇండియా మ్యాచ్‌తో లార్డ్స్‌ మైదానంలో ఆరంభమైన ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ ఏకంగా టీమిండియాపై 202 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తూర్పు ఆఫ్రికాను 181 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆ తదుపరి మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ను 73 పరుగుల తేడాతో ఓడించగా.. వెస్టిండీస్‌ శ్రీలంకపై 9 వికెట్ల తేడా(236 బంతులు మిగిలి ఉండగా)తో గెలుపొందింది.  

అదే విధంగా.. జూన్‌ 11 నాటి మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ మీద 80 పరుగులతో, ఆస్ట్రేలియా శ్రీలంకపై 52 పరుగులతో, వెస్టిండీస్‌ పాకిస్తాన్‌ మీద ఒక వికెట్‌(రెండు బంతులు మిగిలి ఉండగా) తేడాతో, ఇండియా- తూర్పు ఆఫ్రికా మీద 10 వికెట్ల తేడాతో(181 బంతులు మిగిలి ఉండగా) జయభేరి మోగించాయి.

ఆ తర్వాత జూన్‌ 14న జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ శ్రీలంక మీద 192 పరుగులు, వెస్టిండీస్‌ ఆస్ట్రేలియా మీద 7 వికెట్లు(84 బంతులు మిగిలి ఉండగా), న్యూజిలాండ్‌ ఇండియా మీద 4 వికెట్లు, ఇంగ్లండ్‌ తూర్పు ఆఫ్రికా మీద 196 పరుగుల తేడాతో గెలుపొంది సత్తా చాటాయి.

సెమీస్‌కు చేరిన జట్లు
ఈ క్రమంలో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదటి సెమీస్‌ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా తలపడగా.. 188 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం ఆసీస్‌ను వరించింది.

ఇక రెండో సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌ 119 బంతులు మిగిలి ఉండగానే కివీస్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి.

ఫైనల్లో టాస్‌ గెలిచి
జూన్‌ 21న లార్డ్స్‌ మైదానంలో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కంగారూ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  అందుకు తగ్గట్లుగానే ఆసీస్‌ బౌలర్లు చెలగరేగడంతో విండీస్‌ ఓపెనర్లు రాయ్‌ ఫ్రెడెరిక్స్‌, సర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌ వరుసగా 7, 13 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

వన్‌డౌన్‌లో వచ్చిన అల్విన్‌ కల్లిచర్రాన్‌ 12 పరుగులు చేసి నిష్క్రమించగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహన్‌ కన్హాయ్‌ 105 బంతుల్లో 55 పరుగులతో రాణించాడు.

ఇతడికి జతకలిసిన కెప్టెన్‌ సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ 85 బంతుల్లో 102 పరుగులు సాధించి విండీస్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ 5 పరుగులకే అవుట్‌ కావడంతో మరోసారి నిరాశ ఆవహించింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కీత్‌ బోయ్సే 34 పరుగులు చేయగా.. బెర్నార్డ్‌ జూలియన్‌ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. డెరిక్‌ ముర్రే 14, వాన్‌బర్న్‌ హోల్డర్‌ 6(నాటౌట్‌) పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 60 ఓవర్లలో వెస్టిండీస్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.

చాపెల్‌ రనౌట్‌ కావడంతో
ఇక లక్ష్య ఛేదనకు దిగిన చాపెల్‌ బృందానికి ఓపెనర్‌ అలన్‌ టర్నర్‌ 40 పరుగులు చేసి శుభారంభం అందించాడు. మరో ఓపెనర్‌ రిక్‌ మెకాస్కర్‌(7) విఫలం కాగా.. అర్ధ శతకం సాధించి ప్రమాదకరంగా మారుతున్న కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. రిచర్డ్స్‌, లాయిడ్‌ కలిసి రనౌట్‌ చేశారు. 

దీంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ పతనం ఆరంభమైంది. గ్రెగ్‌ చాపెల్‌ 15 పరుగులు చేసి రనౌట్‌ కాగా.. వాలర్డ్స్‌ , రోడ్‌ మార్ష్‌, రాస్‌ ఎడ్వర్డ్స్‌, గ్యారీ గిల్మోర్‌, మాక్స్‌ వాకర్‌, జెఫ్‌ థామ్సన్‌, డెనిస్‌ లిలీ వరుసగా 35,11,28,14,7,21,16 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్ల ధాటికి నిలకవలేక 58.4 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.

తొలి చాంపియన్‌గా లాయిడ్‌ బృందం
తద్వారా 17 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించి వెస్టిండీస్‌ తొట్టతొలి చాంపియన్‌గా నిలిచింది. శతక వీరుడు విండీస్‌ కెప్టెన్‌ సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నాడు.  ఆ తర్వాత 1979 వరకు వెస్టిండీస్‌ చాంపియన్‌గా కొనసాగడం విశేషం.

ఇక వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదుసార్లు, భారత్, వెస్టిండీస్‌ చెరో రెండుసార్లు, శ్రీలంక, పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ ఒక్కోసారి గెలవగా.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాకు మాత్రం ఈ ఐసీసీ ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే ఉంది.

చదవండి: Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్‌ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top