Ranji Trophy 2022: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్‌ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి

Yashasvi Jaiswal: Honoured To See My Name With Sachin Rohit Elite List - Sakshi

Ranji Trophy 2022- Mumbai: రంజీ ట్రోఫీ 2021-22 రెండో సెమీఫైనల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 227 బంతుల్లో 100 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్‌లో 372 బంతుల్లో 181 పరుగులతో సత్తా చాటాడు. ఒకే మ్యాచ్‌లో ఇలా రెండు సెంచరీలు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు.

చరిత్రకెక్కిన యశస్వి
తద్వారా రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైశ్వాల్‌. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లీ, రోహిత్‌ శర్మ, అజింక్య రహానే, వసీం జాఫర్‌ తదితరుల సరసన చేరాడు. 

సచిన్‌ సర్‌తో పాటు నా పేరు కూడా!
ఈ విషయంపై స్పందించిన యశస్వి జైశ్వాల్‌.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఉన్న జాబితాలో తన పేరు కూడా చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ సమయంలో రికార్డు గురించి తనకు అసలు అవగాహన లేదని, డ్రెసింగ్స్‌ రూమ్‌కి వెళ్లిన తర్వాత సహచర ఆటగాళ్లు చెప్పినపుడే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు.

ఓపికగా వేచి చూశాను!
ఈ మేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో యశస్వి మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ను బాగా అర్థం చేసుకున్నాను. కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. పృథ్వీ అవుటైన తర్వాత ఆర్మాన్‌ జాఫర్‌తో చర్చించి ఎలా ఆడాలన్న అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా సరే.. ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాను.

నిజానికి సెంచరీ మార్కు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నానని తెలుసు. అయితే, క్రీజులో ఉండటమే అన్నింటి కంటే ముఖ్యమైనది అనిపించింది. అందుకే ఓపికగా ఎదురుచూశాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను సాధించిన రికార్డు గురించి నాకు తెలియదు.

డ్రెస్సింగ్‌ రూమ్‌కు రాగానే నా తోటి ఆటగాళ్లు దీని గురించి చెప్పారు. సచిన్‌ సర్‌, వసీం సర్‌, రోహిత్‌, అజింక్య వంటి దిగ్గజాల సరసన నా పేరు చూసుకోవడం నిజంగా నాకు గర్వకారణం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 54వ బంతి వద్ద పరుగుల ఖాతా తెరిచిన యశస్వి.. ఆ తర్వాత అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

47వ సారి ముంబై
ఈ క్రమంలో ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా.. 4 వికెట్ల నష్టానికి 533 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. ఉత్తరప్రదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్‌ అయిన నేపథ్యంలో ముంబై ఫైనల్‌కు చేరుకుంది. ఇక ముంబై జట్టు రంజీ ట్రోఫీలో ఫైనల్‌ చేరడం ఇది 47వ సారి. ఇప్పటి వరకు 41 సార్లు విజేతగా నిలిచింది. జూన్‌ 22 నుంచి మధ్యప్రదేశ్‌తో ఈ సీజన్‌ ఫైనల్‌లో ముంబై తలపడనుంది.

చదవండి: IRE vs IND: ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top