● కొడంగల్‌కు రూ.9 వేల కోట్లిచ్చి.. ఇక్కడి సమస్యలు పట్టించుకోరా? ● ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్: సమస్యలు పరిష్కరించకుండా జిల్లా పర్యటనకు వస్తే ప్రజల సమక్షంలోనే సీఎంను నిలదీస్తామని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో సిద్దిపేట పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి మరిచిపోయారని తెలిపారు. కొడంగల్‌లో మూడు రోజులు పర్యటించి రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను ఎందుకు పూర్తిచేయడం లేదని ప్రశ్నించారు. గజ్వేల్ రింగు రోడ్డుకు తట్టెడు మట్టిని కూడా వేయలేదన్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల, ఆర్‌అండ్‌బీ రోడ్ల సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం దొరకలేదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి తరుచూ ఇక్కడికి వస్తున్నా సమస్యలకు పరిష్కారం దొరకటం లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిని బయటపెడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించినా.. ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేకపోయారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, నాయకులు మనోహర్‌యాదవ్, ఎల్లు రాంరెడ్డి, జిల్లా రమేశ్ పాల్గొన్నారు. కాగా హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మెనిఫెస్టో ప్రతులను చించి డస్ట్‌బిన్‌లో పడేశారు.
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
గజ్వేల్‌లో ఏర్పాటుచేసిన సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతులు తమ పత్తి ఉత్పత్తులను సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకొని మద్దతు ధర పొందాలన్నారు. ఆ తర్వాత ఎంపీ పెండింగ్‌లో ఉన్న ప్రజ్ఞాపూర్ ఆర్‌టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. పనులు జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు.


