న్యూస్‌రీల్
మల్లన్నసాగర్ రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరువవుతున్న క్రమంలో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు. ఎల్‌నినో, ఇతర కారణాలతో నీటి ఎత్తిపోతలు లేకపోవడంతో 50టీఎంసీల సామర్థ్యమున్న ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిల్వలు 12టీఎంసీలకు పడిపోయింది. రాబోవు రోజుల్లో మరింత వేగంగా నీటి మట్టం తగ్గనుండటంతో నీటి సర్దుబాటుపై అందోళన
అధికారులను వేధిస్తున్నది. ఏడు జిల్లాలకు
సంబంధించిన మిషన్ భగీరథ పథకానికి, హైదరాబాద్ నగర అవసరాల సరఫరా చేసే నీటి విషయంలోనూ గడ్డు రోజులు సంక్రమించే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈనెల 19న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారుతోంది.
– గజ్వేల్
డెడ్ స్టోరేజీకి చేరువలో మల్లన్నసాగర్ రిజర్వాయర్
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో సాగునీటికే కాకుండా, ఏటా 10టీఎంసీల (డెడ్‌స్టోరేజీ) నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1100కోట్లకుపైగా వ్యయంతో ఈ రిజర్వాయర్ ఆధారంగా ‘మల్లన్నసాగర్ భగీరథ’ పథకాన్ని చేపట్టి పూర్తి చేసి ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది. రిజర్వాయర్‌లోని ఆఖరి టీఎంసీ నీటిని కూడా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విధంగా వ్యవస్థను సిద్ధం చేశారు. ఇందుకోసం కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద అతి పెద్దదిగా 540ఎంఎల్‌డీ సామర్థ్యంతో డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ని నిర్మించారు. 2048 వరకు ఉండే అవసరాలను తీర్చే స్థాయిలో దీనిని తీర్చిదిద్దారు.
ప్రస్తుతం అందుబాటులో వచ్చిన మల్లన్నసాగర్ భగీరథ పథకం ద్వారా సిద్దిపేట, జనగామ, మెదక్, సూర్యాపేట, మేడ్చల్, మహబూబాబాద్ జిల్లాలతోపాటు యాదాద్రి జిల్లాలకు కలుపుకొని నిత్యం సుమారుగా 320 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా చేస్తుండగా.. మరో వారం తరువాత 440 ఎంఎల్‌డీకి చేరనుంది.
మల్లన్నసాగర్ భగీరథ పథకం ద్వారా ప్రస్తుతం హైదరాబాద్ అవసరాలకు నిత్యం 50ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు. కొండపాకలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్(హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్) సంపులోకి నిత్యం నీటిని పంపుతున్నారు. దీని తర్వాత పైప్‌లైన్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎల్‌నినో, ఇతర కారణాలతో ఈ రిజర్వాయర్‌లోకి ఈసారి నీటి ఎత్తిపోతల నిలిచిపోవడం వల్ల ప్రస్తుతం నీటిమట్టం 12టీఎంసీలకు పడిపోయింది. ఈ క్రమంలో ఈ నీటిని వచ్చే వానాకాలం వరకు హైదరాబాద్‌తోపాటు మరో ఏడు జిల్లాలకు ఎలా సర్దుబాటు చేయగలమనే అంశంపై అధికారుల్లో ఆందోళన నెలకొన్నది.
పూర్తిస్థాయి నీటి వాడకం సాధ్యమేనా?
ప్రస్తుతం హైదరాబాద్‌తో కలుపుకొని మరో ఏడు జిల్లాలకు నిత్యం సుమారుగా 500 ఎంఎల్‌డీ నీటిని వాడుకోవాల్సి ఉంది. ఇలా వాడితే వచ్చే వానాకాలం వరకు సుమారుగా 5టీఎంసీల నీరు వాడకం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన 7 టీఎంసీల నిల్వలో ఎండల తీవ్రత, భూమిలో ఇంకిపోవడం వంటి కారణాలతో చాలా వరకు పడిపోనుందని చెబుతున్నారు. ముఖ్యమైన విషయమేమీటంటే డెడ్‌స్టోరేజీ నీరు అపరిశుభ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు. కనీసం 2 టీఎంసీల మేర చేపలకు, ఇతర నీటి ఆధారిత జీవులకు మిగిలి ఉంచాల్సి ఉందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే వానాకాలం వరకు నీటి సర్దుబాటు సాధ్యమేనా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం సర్వత్రా చర్చకు దారితీసింది.


