బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలు మార్కెట్లో కిలో రైస్ రూ.75 పైనే జిల్లాకు 6,653 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగబడి తీసుకెళ్లిన లబ్ధిదారులు రెండు రోజుల్లో వంద శాతం పూర్తికానున్న కోటా
దుబ్బాక: బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో భగ్గుమంటున్నాయి. దీంతో రేషన్ బియ్యానికి భలే డిమాండ్ ఏర్పడింది. గతంలో రేషన్ ద్వారా అందించే దొడ్డుబియ్యం చాలావరకు పక్కదారి పట్టడంతో దీనికి అడ్డుకట్టవేయడంతోపాటు పేదప్రజలకు సన్నబియ్యం అందించేందకు ప్రభుత్వం గత 2025 ఏప్రిల్‌లో సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టింది. ఎంతగా కట్టడి చేసినప్పటికీ సన్నబియ్యం సైతం పక్కదారి పట్టడం ఆగలేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతంత మాత్రంగానే పడటంతో వరి దిగుబడి చాలావరకు తగ్గింది. దీంతో ఒక్కసారిగా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చి ఆకాశన్నంటాయి. దీంతో ఈసారి ప్రజలు రేషన్ బియ్యాన్ని ఎగబడి తీసుకెళ్లారు. సాధారణంగా రేషన్ దుకాణాలు ప్రతీనెల 1వ తారీఖున బియ్యం ఇవ్వడం ప్రారంభిస్తే 20 రోజుల వరకు తెరచిన 70% వరకు కూడా కోటా పూర్తికాకపోయేది. మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో ఈ నెలలో కేవలం పదిరోజుల్లోనే 80% బియ్యం కోటా పూర్తికావడం విశేషం.
90%కు పైగా బియ్యం కోటా పూర్తి
జిల్లాల్లో కేవలం 15 రోజుల్లోనే 90%కు పైగా రేషన్ బియ్యం కోటా పూర్తి అయింది. సాధారణంగా 60% వరకు గతంలో అయ్యేది. జిల్లాలో మొత్తం 686 రేషన్ షాపుల ద్వారా పేదప్రజలకు బియ్యం అందిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,98,965 వివిధ రకాల రేషన్ కార్డులుండగా 9,58,598 మంది ప్రజలకు బియ్యం అందిస్తుంది. ఇందుకోసం 6,653 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా ప్రతీ నెల కేటాయిస్తున్నారు. ఈ నవంబర్‌లో పూర్తిస్థాయి కోటా బియ్యం షాపులకు అందించగా కేవలం 15 రోజల్లోనే 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని ప్రజలు తీసుకెళ్లారు. సాధారణంగా ఇదివరకు (గత నెలల్లో) 15 రోజుల్లో కేవలం 60%లోపే కోటా ఖాళీ అయితుండేది. నెలంతా చాలా షాపులు వినియోగదారులు బియ్యం తీసుకెళ్తారని నెల చివరి వరకు తెరిచే ఉంచేవారు. ఈ నెలలో కోటా పూర్తి కావడంతో కేవలం వారం రోజుల్లోనే జిల్లాలో 600కు పైగా రేషన్ షాపులు క్లోజ్ చేసుకున్నారు. కొద్దిగా కోటా మిగిలినవున్న దుకాణాలు మాత్రమే తెరిచి ఉండటంతో మిగిలిన వారు వచ్చి తీసుకెళ్తున్నారు.
మరో రెండు రోజుల్లో పూర్తి..
మరో రెండు రోజుల్లో వంద శాతం బియ్యం సరఫరా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో బియ్యం ధరలకు డిమాండ్ ఏర్పడటంతోనే రేషన్ బియ్యాన్ని జనం మరి ఎగబడి తీసుకెళ్లడం కనిపించింది. మార్కెట్లో బియ్యం ధరలు పెరగడంతో రేషన్ బియ్యానికి ప్రజల్లో చాలా డిమాండ్ ఏర్పడిందనే చెప్పొచ్చు.
90%కు పైగా బియ్యం సరఫరా


