వంతెన లేక రైతుల అవస్థలు
● పట్టించుకోని అధికారులు ● అప్పాయపల్లిలో దుస్థితి
దుబ్బాకటౌన్: సాగునీటి కోసం అధికారులు కాలువ తవ్వడం రైతన్నలకు శాపంలా మారింది. పొలాలకు వెళ్లే దారిని విభజిస్తూ కాలువ నిర్మాణం చేపట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువ అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్‌కు సాగు నీటిని సరఫరా చేసేందుకు దౌల్తాబాద్ మండలం అప్పాయపల్లి మీదుగా అధికారులు కాలువను నిర్మించారు. అప్పాయపల్లికి చెందిన పలువురు రైతుల పొలాలు.. కాలువ అవతలి వైపు ఉన్నాయి. ఆ పొలాలకు వెళ్లేందుకు గతంలో దారి ఉండేది. కాని కాలువ నిర్మాణంతో రైతులు పొలాలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.
ఈ దారి వెంబడి పొలాల వద్దకు వెళ్లే వృద్ధుల పరిస్థితి దుర్బరంగా మారింది. యువకులు మోసుకెళ్తే గానీ కాలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. వీరు యువకులను బతిమాలి కాలువ ఆవలి వైపు వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు వెంటనే స్పందించి కాలువపై అవసరమైన చోట వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇచ్చిన మాట తప్పారు..
కాలువ నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పెద్దసార్లు ఇచ్చిన మాట తప్పిండ్రు. అసలే వానకాలం కాలువ దాటాలంటే భయామేస్తుంది. నీటి ప్రవాహం లేనప్పడు కాలువ దాటుతున్నాం. కానీ నీరు ఉన్నప్పుడు సుమారు 3 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సివస్తోంది. –పెద్దలచ్చు అశోక్
అధికారులు స్పందించాలి
వంతెన నిర్మించాలని ఎన్నో సార్లు విన్నవించినా అధికారులు స్పందించడంలేదు. కాలువ నిర్మాణం చేసేటప్పడు రైతులకుఅండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రైతులు అవస్థలు పడుతున్నా కనీస స్పందన కరవైంది. అధికారులు వెంటనే స్పందించి వంతెన నిర్మించాలి.
–కేశబోయిన ప్రభాకర్,
మాజీ ఉపసర్పంచ్, అప్పాయపల్లి
మాట తప్పిన అధికారులు
2018 సంవత్సరంలో అధికారులు కాలువ నిర్మాణం చేపట్టారు. కాలువ నిర్మాణం పూర్తవడంతో రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు తీవ్ర అడ్డంకి ఏర్పడింది. కాలువ నిర్మాణ సమయంలో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు. కాలువ పైన అవసరమైన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తామని అధికారులు, కాంట్రాక్టర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కానీ కాలువ నిర్మాణం పూర్తి చేసి వంతెనలు నిర్మించకుండానే చేతులు దులుపుకొన్నారు. దీంతో ప్రతీరోజు సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


