● కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూ దొందే ● మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్: ప్రజా సమస్యలు పక్కదోవపట్టించేందుకే టీపీసీసీ చీఫ్ క్షుద్రపూజల పంచాయితీని తెరపైకి తెచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్‌లో పద్మశాలిభవన్ కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు నిజంగానే క్షుద్రపూజలు చేసినట్లు రుజువైతే ఎందుకు కేసులు పెట్టి లోపలేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసు, కార్ల కేసులు ఉత్తగనే ఇడిసిపెడితెరి? అంటూ దుయ్యబట్టారు. నువ్వు తిట్టినట్లు చేయి, నేను కొట్టినట్లు చేస్తా అనే విధంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యతో అల్లాడుతుండగా, దానిని పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తే రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకే అంశంపై సవాళ్లు, ప్రతి సవాళ్లతో మీడియా దృష్టి ఆకర్శించడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవీదాస్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఆయన కూతురు డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళలు భారీగా పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ శిబిరాన్ని సందర్శించి పరీక్షలకు వచ్చిన మహిళలతో మాట్లాడారు.
దుబ్బాక: ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు సవరణలో) రాష్ట్రంలోనే వంద శాతం పూర్తి చేసుకున్న మొదటి నియోజకవర్గంగా దుబ్బాక నిలవడం గర్వకారణంగా ఉందని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త పల్లెవంశీ కృష్ణాగౌడ్‌తో పాటు పలువురిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా ముందంజలో ఉండాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీయువకుల నూతన ఓటు హక్కును బీజేపీ శ్రేణులు ముందుండి నమోదు చేయించాలన్నారు.


