● రాబోయే రోజుల్లో సాగులో సిద్దిపేట అగ్రస్థానమే.. ● మాజీ మంత్రి హరీశ్‌రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆయిల్‌పామ్ సాగుతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయని, రాబోయే రోజుల్లో ఆయిల్ పామ్ సాగులో దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో సిద్దిపేట నిలుస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేడిపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. రైతు పాపిరెడ్డి సాగు చేసిన తోటలో ఆయిల్ పామ్ గెలలు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల జీవితాల్లో మార్పు రావాలన్న తన ఐదేళ్ల కల ఆయిల్ పామ్ సాగుతో సాకారమైందన్నారు. ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను చూసినప్పుడు సిద్దిపేట రైతులు కూడా ఇలా ఆర్థికంగా ఎదగాలని తాను కోరుకున్నానన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాక తేమ శాతం పెరిగి సాగుకు అనుకూలంగా మారిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అద్భుతం సాధ్యమైందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 5,322 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, 301 ఎకర్లాలో పంట కటింగ్ మొదలైందన్నారు. భవిష్యత్‌లో సిద్దిపేటలో 50 వేల ఎకరాలకు విస్తరించి రాష్ట్రానికి సిద్దిపేట దిక్సూచిగా మారుస్తామన్నారు. ఆయిల్ పామ్ రైతుకు మాత్రమే కాకుండా సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అనంతరం కస్తూరిపల్లిలో పోచమ్మ బోనాల పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు ఉన్నారు.
రైతులకు డబ్బులే డబ్బులు
సిద్దిపేటరూరల్: సంప్రదాయ పంటలు కాకుండా అధిక ఆదాయం, నెలనెలా జీతం మాదిరిగా డబ్బులు వచ్చే ఆయిల్‌పామ్ పంటను సాగు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు రైతులకు సూచించారు. ఆదివారం నారాయణరావుపేట మండల పరిధిలోని గోపులాపూర్‌లోని రైతు సోప్పరి రవి వ్యవసాయ భూమిలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ గోపాలపూర్‌లో 54 మంది రైతులు 120 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారన్నారు. నేడు రైతులే వచ్చి మొక్కలు ఇప్పించండి.. పంట సాగు చేసుకుంటామని ఆడుగుతుండటంతో గొప్పమార్పు వచ్చిందన్నారు.


