జూన్ 1 నుంచి ఇప్పటి వరకు కురవాల్సింది 227.8మి.మీ ఇప్పటివరకు కురిసింది. 162.8మి.మీటర్లే రైతుల్లో కలవరం
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు అబ్బసాని మల్లయ్య. ఈయనది మర్కూక్ మండలం గంగాపూర్ గ్రామం. తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం నారు కూడా సిద్ధంగా ఉంది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో తన బోరుబావిలో నీటిమట్టం పడిపోయింది. కొండపోచమ్మసాగర్ కాల్వలోకి నీరు ఇంకా వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయాలా...? వద్దా...? అనే సందిగ్ధంలో ఉన్నాడు. ఇది ఒక్క అబ్బసాని మల్లయ్యదే కాదు. జిల్లాలోని రైతులందరూ దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ప్రధానంగా వరిసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. మిగతా పంటల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈ వ్యవహారంపై కథనం..
గజ్వేల్: జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 227.8మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..162.8మి.మీల మాత్రమే నమోదైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 28.5% లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడున్న 26 మండలాల్లోని అక్బర్‌పేట–భూంపల్లిలో ఇప్పటివరకు 243.2మి.మీల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 245.మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ ఒక్క మండలం మినహా మిగతా 25మండలాల్లో మైనస్ వర్షపాతమే ఉన్నది.
వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు
వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైంది. వర్గల్ మండలంలో జూన్ 1నుంచి ఇప్పటివరకు 210.5మి.మీల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 71.9మి.మీలు మాత్రమే కురిసింది. ఫలితంగా ఈ మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 65.8% లోటు వర్షపాతం నమోదైంది. ములుగు మండలంలో 223.3 మి.మీలు కురవాల్సి ఉండగా..ఇప్పటివరకు 77.8మి.మీలు మాత్రమే కురవగా ఈ లెక్కన 65.2% మైనస్ వర్షపాతం నమోదైంది.
రైతుల్లో మొదలైన కలవరం
జిల్లాలో ఈసారి 5.41లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఇందులో ప్రధానంగా వరి అత్యధికంగా 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తే...ఇప్పటివరకు సాగులోకి వచ్చింది 49,646ఎకరాల్లో మాత్రమే. కాగా, పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 24,509ఎకరాల్లో, కంది 5,046 ఎకరాల్లో, స్వీట్ కార్న్ 907, పెసర్లు 119, చెరుకు 25ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమేకాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ, ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు ఎలా ముందుకుసాగాలో సలహాలు, సూచనలు చేస్తున్నామన్నారు.
జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతం


