ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి

Jul 22 2026 9:00 AM | Updated on Jul 22 2026 9:00 AM

జెడ్పీ సీఈఓ రమేశ్‌

సిద్దిపేటరూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉన్న క్రమంలో రైతులు అధిక నీరు అవసరమున్న వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జెడ్పీ సీఈఓ రమేశ్‌ రైతులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్‌ గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ సీఈఓ, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి రమేశ్‌ మాట్లాడుతూ...తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవచ్చన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతాంగం ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహారం అందించనున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పద్మ, ఉపసర్పంచ్‌ వెంకటేశ్‌, ఎంఈఓ రాజిరెడ్డి, ఎంపీడీఓ రామరాజు, ఏఓ నరేశ్‌, పీఆర్‌ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పూర్వ వైభవం తీసుకువస్తాం

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రం

బెజ్జంకి(సిద్దిపేట)/ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపెల్లి చంద్రం అన్నారు. బెజ్జంకితో పాటు మండలంలోని తోటపల్లిలోని గ్రంథాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల పరిస్థితిని పరిశీలించి వాటి అభివృద్ధి కోసం రాష్ట్ర చైర్మన్‌కు, ప్రభుత్వానికి వివరించనున్నట్లు తెలిపారు. సిబ్బంది హరిప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ నర్సయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌, కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌, రవితేజ, అశోక్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్‌ మాట్లాడుతు బీసీల సంక్షేమం కోసం దరిపల్లి చంద్రం చేస్తున్న కృషి విలువైందన్నారు. వాసురి ఎల్లం, రవికుమార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో

వైద్య సేవలందించాలి

డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌

కొండపాక(గజ్వేల్‌): సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందేలా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ సూచించారు. కుకునూరుపల్లిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను వైద్యం కోసం వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కలియ తిరుగుతూ ల్యాబ్‌, మెడికల్‌ గదిని, లేబర్‌ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ధన్‌రాజ్‌ మాట్లాడుతూ...సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై విస్త్రృతంగా ప్రచారం చేయాలన్నారు. గర్భిణుల నమోదు నుంచి ప్రసవమయ్యేంత వరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించేలా అవగాహన సదస్సులను నిర్వహించుకోవాలన్నారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్‌కుమార్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌ లలిత, హెచ్‌ఎస్‌ సుజాత, ల్యాబ్‌ టెక్నీషియన్‌ బాలమణి, ఫార్మాసిస్టు సోమిత, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement