జిల్లాలో మ్యాప్‌లేని 21 గ్రామాల్లో
భూ రీ సర్వే పూర్తి
జిల్లా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్
ఏడీ సుదర్శన్ రాథోడ్
దుబ్బాక: భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి రీసర్వే చేపడుతుందని జిల్లా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు సుదర్శన్ రాథోడ్ పేర్కొన్నారు. దుబ్బాకలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై రైతులకు మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం,భూముల రీసర్వే, డిజిటల్ మ్యాపింగ్, కొత్త రికార్డుల తయారీ, రైతులకు భూ హక్కుల కల్పనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా మ్యాప్‌లేని 21 గ్రామాల్లో భూభారతి రీసర్వే చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే, కొత్త మ్యాపుల తయారీ చేపట్టినట్లు తెలిపారు. రైతులు భూముల రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మోతీసింగ్, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ సులోచన, చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, బండి శ్రీలేఖ, అనంతుల భాగ్యమ్మ, ఐరేని అఖిల తదితరులు పాల్గొన్నారు.


