వర్గల్(గజ్వేల్): బ్రహ్మోత్సవ సిరులతో నాచగిరి అలరారుతున్నది. హరిద్రా తీరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నది. అంగరంగ వైభవంగా సాగుతున్న ఉత్సవ వేడుకలు తీర్థజనులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. స్వామివారి దివ్యమంగళరూపం దర్శించుకుని భక్తజనులు పునీతులవుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పొన్న వాహనోత్సవ సేవ భక్తజనావళిని నేత్రపర్వం చేసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు పొన్నవృక్షమే వాహనంగా యోగముద్రలో నృసింహస్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాగా బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన రథోత్సవ ఘట్టం మంగళవారం రాత్రి ప్రారంభమవుతుంది. రథప్రతిష్ఠ అనంతరం బుధవారం తెల్లవారుజామున స్వామివారి దివ్య విమాన రథోత్సవ ఊరేగింపు కనుల పండువగా జరుగుతుంది. ఇందుకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి పేర్కొన్నారు.


